ఏళ్లుగా ఉన్నత విద్య, మంచి కెరీర్ కోసం అమెరికా వైపు చూసిన భారతీయ విద్యార్థుల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియన్ Gen Z.. అమెరికాను గతంలోలా డిఫాల్ట్ డెస్టినేషన్‌గా చూడటం లేదని తాజా సర్వే వెల్లడించింది.
అమెరికాలో చదువుల ఖర్చు భారీగా పెరగడం, వీసా నిబంధనలపై అనిశ్చితి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం, గ్రీన్ కార్డ్ పొందడం కష్టంగా మారడం వంటి అంశాలు యువత ఆలోచనలను మార్చుతున్నాయి.
ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి మాట్లాడుతూ.. మొదట అమెరికాలో చదువుకోవాలని ఎక్కువగా అనుకున్నానని, కానీ ఇప్పుడు యూరప్ లేదా ఆస్ట్రేలియా వైపు ఆలోచిస్తున్నానని చెప్పాడు. ముఖ్యంగా అమెరికా వీసా, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ పొందడం చాలా కష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
మరోవైపు.. భారీ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా యువతను ఆలోచనలో పడేస్తున్నాయి. చదువు కోసం తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే భయం కూడా ఉందని కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి పేర్కొన్నాడు.
Emeritus నిర్వహించిన తాజా పరిశోధనలో 15 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వెయ్యికి పైగా భారతీయులను సర్వే చేశారు. ఇందులో 48 శాతం మంది విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి తమలో తగ్గిందని చెప్పారు.
విదేశీ విద్యపై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాల్లో 41 శాతం మంది అధిక విద్యా ఖర్చులను, 34 శాతం మంది కఠినమైన వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను, 31 శాతం మంది కుటుంబ సహకారం లేకపోవడాన్ని కారణాలుగా పేర్కొన్నారు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువత పూర్తిగా విదేశీ విద్యను వదులుకోవడం లేదు. అమెరికాకు బదులుగా యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలను పరిశీలిస్తున్నారు.
అంతేకాదు.. భారత్‌లోనే అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లను ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సర్వేలో 68 శాతం మంది భారత్‌లో అందుబాటులో ఉన్న గ్లోబల్ ర్యాంక్ ప్రోగ్రామ్‌లను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీసా అనిశ్చితిని తప్పించుకునేందుకు భారత్‌లోనే అంతర్జాతీయ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలని 69 శాతం మంది ట్రాన్సిషనింగ్ స్టూడెంట్స్ భావిస్తున్నారు.
ఇక Gen Z కెరీర్ ఆలోచనలు కూడా మారుతున్నాయని సర్వే చెబుతోంది. 82 శాతం మంది వారానికి కనీసం ఒక్కసారైనా AI టూల్స్‌ను నేర్చుకోవడానికి లేదా కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. 74 శాతం మంది లీడర్‌షిప్ టైటిల్స్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అంటే.. అమెరికా మీద ఆసక్తి పూర్తిగా పోయిందని కాదు. కానీ భారీ ఖర్చులు, వీసా అనిశ్చితి, భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని భారతీయ Gen Z ఇప్పుడు మరింత ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది.









