
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. జిహెచ్‌ఎంసి ప రిధిలోని మూడు కార్పొరేషన్లతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ సత్తా చూపిస్తామన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ సంస్థాగత సమావేశం జరిగింది. అత్యవసరంగా నిర్వహించిన ఈ సమావేశంలో రాంచందర్‌రావు తో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, లోక్‌సభ సభ్యులు ధర్మపురి అరవింద్, జి. నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఇంకా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ కూడా హాజరయ్యారు. సమావేశానంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పొత్తుల కోసం తాము చూడడం లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్షంగా పార్టీ అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహంపై రోడ్-మ్యాప్ సిద్ధం అవుతున్నదని ఆయన చెప్పారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం కానున్నారని ఆయన తెలిపారు. 937 మండలాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
పలువురు ప్రముఖుల రాక..
ఇతర పార్టీల నుంచి పలువురు ప్రముఖ నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నార, వారిని త్వరలో చేర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు. అయితే వారి పేర్లు ఇప్పుడే చెప్పనని, గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, అవసరం వచ్చినప్పుడు చెబుతానని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా అన్నారు.
కలిసి పని చేయండి: నితిన్ నబీన్
ఇదిలాఉండగా పార్టీ నేతలు విభేదాలు పక్కన పెట్టి అధికారంలోకి రావడమే లక్షంగా పని చేయాలని నితిన్ నబీన్ పార్టీ నేతలతో అన్నారు. విభేదాలు పక్కన పెట్టకపోతే పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతారని, తద్వారా పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన వారిని సున్నితంగా హెచ్చరించారని తెలిసింది. ఇకమీదట ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రానికి వస్తానని ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారంలోకి రావడానికి పశ్చిమ బెంగాల్ కంటే మెరుగైన పరిస్థితులు తెలంగాణలో తనకు కనిపించాయని నితిన్ నబీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన సూచించారు. పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని నితిన్ నబీన్ పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు.








