మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ నాయకత్వంలో అమలైన నేతన్న బీమా, నేతన్నకు చేయూత వంటి అనేక నేతన్నల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి నేతన్నలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. వెంటనే అన్ని పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకునే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత రంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ నేతన్న బీమా అమలు చేశామని తెలిపారు. ఒక్కో కార్మికుడికి ప్రీమియం ప్రభుత్వమే భరించిందని వివరించారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ, కార్మికుడు ప్రతినెల రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 వరకు వాటా జమ చేసే వినూత్న విధానాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ అందించడంతో పాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.

నేతన్నల కోసం గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. పార్టీలు వేరైనా చేనేత విషయంలో కేంద్రంలోని బిజె పి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిలో ఎలాంటి తేడా లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలని కెటిఆర్ లేఖలో సిఎంకు విజ్ఞప్తి చేశారు.