వాషింగ్టన్: అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. దేశంలో అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలతో నివసిస్తున్న విదేశీయుల పిల్లల కు పౌరసత్వం నిరాకరించేలా ట్రంప్ జా రీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును సు ప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తన ప్రస్తుత పదవీకాలంలో ట్రంప్ తీసుకొచ్చిన కీలక వలస విధానాల్లో ఇదొకటి. అయితే దిగువ కోర్టులు ఇప్పటికే ఈ ఉత్త ర్వు అమలును నిలిపివేయగా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ రచించిన మెజారిటీ తీర్పును 6-3 ఓట్ల తేడాతో సుప్రీంకోర్టు ఆమోదించింది. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు అక్కడ జన్మించిన పిల్లలు కూడా అమెరికా అధికార పరిధిలోకి వస్తారని

, అందువల్ల రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం వారికి జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ‘అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి. రాజకీయ వ్యవస్థలో సమానంగా భాగస్వాములు అయ్యే అవకాశం కల్పించడమే 14వ సవరణ ఉద్దేశం. ఆ హామీని నేడు కూడా మేము కొనసాగిస్తున్నాం’ అని జస్టిస్ రాబర్ట్స్ తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడడానికి కొద్ది నిమిషాల ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రయత్నాలు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా, రాకపోయినా విజయవంతమయ్యే అవకాశం ఉందంటూ వచ్చిన కథనాన్ని పంచుకున్నారు. టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ సభ్యుడు బ్రియాన్ బాబిన్ స్పందిస్తూ, ‘అమెరికా పౌరసత్వం అమూల్యమైన హక్కు. దానిని దుర్వినియోగం కాకుండా కాపాడాలి.

వలస వ్యవస్థలో సమగ్రతను పునరుద్ధరించి, చట్టబద్ధ పాలనను పరిరక్షించాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు దశాబ్దాలుగా అమలులో ఉన్న వ్యాఖ్యానాన్ని సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఈ సవరణ తొలుత బానిసత్వం నుంచి విముక్తి పొందిన నల్లజాతి ప్రజలకు పౌరసత్వ హక్కు కల్పించేందుకు తీసుకొచ్చినప్పటికీ, దాని పౌరసత్వ నిబంధన అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ వర్తించేలా రూపొందించబడింది. ట్రంప్ తన రెండో అధ్యక్ష పదవీకాలం మొదటి రోజే ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా పౌరులు కాని వ్యక్తుల పిల్లలు అమెరికా అధికార పరిధిలోకి రారని, అందువల్ల వారికి పౌరసత్వ హక్కు ఉండదని ఆయన ప్రభుత్వం వాదించింది. అయితే ఆ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికీ జన్మహక్కు పౌరసత్వం వర్తిస్తుందని స్పష్టం చేసింది.