
జంతర్‌మంతర్ వద్ద ఆందోళన మొదలుపెట్టిన వెంటనే గాని ప్రభుత్వం త్వరపడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కాని, ప్రధాని మోడీ బృందానికి ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఎవరెస్టు స్థాయికి పెరిగి పోయింది. వరుసగా గెలుస్తున్నారు, అందరినీ చీల్చుతున్నారు, ప్రజలను మతతత్వ నినాదాలతో పంచేంద్రియాలను భ్రమపెడుతున్నారు, విదేశాంగ విజయాలంటూ మైమరపింపజేస్తున్నారు, 2014లో గుజరాత్ మోడల్ అంటూ తప్పుదారి పట్టించగలిగినట్లే, భారత అభివృద్ధితో మొత్తం ప్రపంచానికే కళ్లు చెదిరిపోతున్నాయని హోరెత్తించగలుగుతున్నారు. ఇంకా కావలసిందేమిటి? నీట్ తదితర పరీక్షల విషయంలో జవాబుదారీతో పనేమున్నది? కాక్‌రోచ్‌లను ఎందుకు అణచివేయగూడదు? వారు గాని, దేశ ప్రజలు గాని చేయగలదేమిటి? గత 12 సంవత్సరాలలో ఎన్నెన్ని ఉద్యమాలను విజయవంతంగా అణచివేయలేదు గనుక? కాని, అధికారపక్షం దురదృష్టవశాత్తు ఈసారి పరిస్థితి వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏదీ ఎల్లకాలం ఒకే తీరున ఉండదు కదా?
అసలు పరిస్థితులన్నవి తేలికగా లేవు. అది చాలదన్నట్లు పరిపాలన సరిగా సాగదు. అది చాలదన్నట్లు కళ్లముందే తప్పులు వరుసగా జరుగుతున్నా అరికట్టరు. అది చాలదన్నట్లు నిరసన ఆందోళనలతో సవ్యంగా వ్యవహరించరు. అది చాలదన్నదన్నట్లు అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తుంటారు. జంతర్‌మంతర్‌లు దేశమంతటా తరచు జరుగుతూనే ఉంటాయి. అనేక ఇతర దేశాలలో కూడా. అయినా పాలకులు ఎక్కడ ఏమీ నేర్వరు. సమస్య ఉన్నది వారి విధానాలలో, నిజాయితీలో.
ఇపుడు లెక్కలలోకి వస్తున్నది గత పదేళ్లలో మొత్తం 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని. అనగా కేంద్రంలోని ప్రస్తుత ఎన్‌డిఎ కాలంలో అని. ఆ సంఖ్య దానికదే దిగ్భ్రమ గొలిపే విషయం. ఆ 152 బ్రేక్ అప్ ఏమిటో తెలియదు. అవన్నీ నీట్ వలెనే పోటీ పరీక్షల ఫలితాలా? ఉద్యోగ పరీక్షలు కూడానా? సాధారణ సంవత్సర పరీక్షలూ చేరి ఉన్నాయా? కేంద్రస్థాయి లెక్కలు మాత్రమేనా? లేక వివిధ రాష్ట్రాలలోని బిజెపి ప్రభుత్వాలను కూడా కలిపారా? తెలియదు. అదట్లుంచి, ఒకవైపు నుంచి ఉద్యమకారులు, ప్రతిపక్షాలు ఈ 152 లెక్క చెప్తుండగా, కేంద్ర మంత్రి జె.పి. నడ్డా 22వ తేదీన, ప్రశ్నాపత్రాలు లీక్ కావటం ప్రతిపక్షాలు అధికారంలోగల రాష్ట్రాలలో సైతం జరిగిందని ఒక జాబితా చదివారు.
బాగున్నది. ఇరువురు కూడా నిజమే కావచ్చు. దేశప్రజలు ఇతరత్రా కూడా ఈ లీకేజీ వార్తలను ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నారు. మరి ఇటువంటి ‘తూతూమైమై’ పరస్పర నిందలు సమస్యను పరిష్కరించట మేమైనా జరుగుతున్నదా? ప్రస్తుత నీట్ విషయమే చూద్దాము. సమస్య తలెత్తి నెలలు గడుస్తున్నది. అది వెలుగులోకి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వం, దానినసలు పేపర్ లీక్ అనలేమని, ఏవో కొన్ని ప్రశ్నలు, ఏవో కొన్ని గెస్ పేపర్లతో పోలి ఉన్నాయి మాత్రమే అని వాదించింది. వివరాలు బయటకు రావటం మొదలుకాగా ఆ వాదన సరికాదని తేలింది. ఆ గెస్ పేపర్లన్నవి దేశంలో ఎక్కడనుంచి వచ్చాయి? వాటిని తయారు చేసిందెవరు? గెస్ పేపరు గాక అసలు ప్రశ్నాపత్రాలు తయారు చేసిందెవరు? ఈ దర్యాప్తులోకి వెళ్లగా బయటపడింది, రెండు పనులు చేసిందీ పుణెలోని అధ్యాపకులే. వారిద్దరో ముగ్గురో తమ ఇళ్లలోనే కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు. వ్యవహారం ఒక కుంభకోణంగా మారి విమర్శలు చెలరేగటంతో ఆ టీచర్లను పట్టుకుని కేసులు పెట్టారు.
ఇది కూడా బాగున్నది. కాని మరొక ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. నీట్ ప్రశ్నాపత్రాలు తయారీ బాధ్యతను వారికి అప్పగించిందెవరు? అట్లా అప్పగించినపుడు ఆ టీచర్లు తమ ఇళ్లలో కోచింగ్ సెంటర్లు నడుపుతున్న సంగతి తెలియదా? వారు కోచింగ్ ఇస్తున్నది నీట్‌తో సంబంధం లేని చరిత్ర భూగోళాల వంటి సబ్జెక్టులు అయితే వేరు. కాని సంబంధం గలవి అయినపుడు బాధ్యతను వారికి ఎట్లా అప్పగించినట్లు? వారికి ఈ బాధ్యతను అప్పగించిన వారిది ప్రాథమిక దోషం అయినట్లు కనిపిస్తూనే ఉన్నపుడు వారిని దోషులు చేయనిది ఎందుకు? వారు గాని, వీరుగాని, వీరందరి వెనుక మరెవరి పూనిక అయినా ఉన్నట్లుయితే వారిపైగాని చర్యలేమిటి?
ఇంతేకాదు. తీగను లాగితే కదలగల డొంక ఇంకా ఉంటుంది. ఒకటి కాదు, అనేక డొంకలు. ఈ మాట వాదన కోసం అంటున్నది కాదు. పైన ప్రస్తావించిన లెక్క ప్రకారం లీకైన పేపర్లు 152. అనగా 152 డొంకలన్న మాట. గమనించవలసిన మరొక విషయమేమంటే, వీటన్నింటిలో ఇంతవరకు ఏఒక్క కేసులోనూ దోషులను శిక్షించలేదు. ఒకవేళ విచారణలు, కేసులు, శిక్షలు జరిగి ఉంటే అది వేరుగా ఉండేది. ప్రస్తుత నీట్‌నే చూడండి. కేంద్రప్రభుత్వం 10, 11 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నది. ఏమి చర్యలవి? ఉన్నచోట్లనుంచి ఇతర చోట్లకు బదిలీలు మాత్రమేనని, అవి ఎట్లా చర్యలవుతాయని ఉద్యమకారులు ప్రశ్నస్తున్నారు. ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. 20 లక్షలకుపైగా అభ్యర్థులను, వారి కుటుంబాలను క్షోభకు గురిచేసి, దేశ ప్రజలందరినీ ఆందోళన పరుస్తూ, ప్రభుత్వ విశ్వసనీయతను అనుమానాస్పదం చేస్తున్న కేసులో, దోషులనే వారిని కేవలం బదిలీ చేసి కాపాడవలసిన అవసరమేమిటి?
వాస్తవానికి మన చుట్టూ జరుగుతున్న ఇదే తరహా వ్యవహారాలలో నీట్‌తోపాటు ఇతర పరీక్షా పత్రాల లీక్ సమస్య ఒకటి మాత్రమే. ఎన్నెన్నో జరుగుతున్నా సరైన దర్యాప్తులు, కేసులు, శిక్షలు ఉంటున్నది పేదలు, మధ్య తరగతికి సంబంధించే తప్ప పెద్దవారి విషయంలో కాదు. ఇందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఇదే సూత్రం పరీక్షా పత్రాల లీక్ ఉదంతాలకు కూడా వర్తిస్తున్నది. ఉద్యోగాలు, పరీక్షలు యువతకు జీవన్మరణ సమస్య కావటంతో, వాటిని సులభతరం చేసేందుకు కార్పొరేట్ కాలేజీల స్థాయి నుంచే, పెద్ద పెద్ద ట్యుటోరియల్ సంస్థలనుంచే ఇందుకు ఆరంభం జరుగుతున్నది. ఇది ఎప్పటినుంచో చూస్తున్నాము. ఆ సంస్థల వారు మొదట డబ్బు ఖర్చుచేసి పరీక్షా పత్రాలు సంపాదించటం తర్వాత జవాబు పత్రాలు దిద్దే వారిని కనిపెట్టి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించటం, వారికి వచ్చే ర్యాంకులతో ఊదరగొట్టి అడ్మిషన్లు పెంచుకోవటం. కిందినుంచి పైవరకు ఎవరి వాటా వారికి.
ఎక్కడికక్కడ స్థానికంగా జరిగేదే జాతీయ పరీక్షలకు సంబంధించి జరగటం మొదలైంది తప్ప ఇందులో అర్థం కానిది లేదు. ఇంతకూ ప్రస్తుత సందర్భంలో ప్రశ్న ఒకటుంది. నీట్ వ్యవహారంలోనూ పుణెలో ప్రశ్నాపత్రాలు తయారు చేసిన వారినుంచి మొదలుకొని పైన ఏ స్థాయి వరకు వాటలు ఉన్నాయన్నద ప్రశ్న. లేనట్లయితే ఈ తీరున కేసును తొక్కి పెట్టటంలో వేరే తర్కం కనిపించదు.
ఇంకా ఏమేమి జరుగుతూ వస్తున్నది? విషయం వెలికి వచ్చిన వెంటనేగాని, కాక్‌రోచ్ జనతా పార్టీ పేరిట ఒక వేదిక ఏర్పడిన వెంటనే గాని, వారు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన మొదలుపెట్టిన వెంటనే గాని ప్రభుత్వం త్వరపడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కాని, ప్రధాని మోడీ బృందానికి ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఎవరెస్టు స్థాయికి పెరిగి పోయింది. వరుసగా గెలుస్తున్నారు, అందరినీ చీల్చుతున్నారు, ప్రజలను మతతత్వ నినాదాలతో పంచేంద్రియాలను భ్రమపెడుతున్నారు, విదేశాంగ విజయాలంటూ మైమరపింపజేస్తున్నారు, 2014లో గుజరాత్ మోడల్ అంటూ తప్పుదారి పట్టించగలిగినట్లే, భారత అభివృద్ధితో మొత్తం ప్రపంచానికే కళ్లు చెదిరిపోతున్నాయని హోరెత్తించగలుగుతున్నారు. ఇంకా కావలసిందేమిటి? నీట్ తదితర పరీక్షల విషయంలో జవాబుదారీతో పనేమున్నది?
కాక్‌రోచ్‌లను ఎందుకు అణచివేయగూడదు? వారు గాని, దేశ ప్రజలు గాని చేయగలదేమిటి? గత 12 సంవత్సరాలలో ఎన్నెన్ని ఉద్యమాలను విజయవంతంగా అణచివేయలేదు గనుక? కాని, అధికారపక్షం దురదృష్టవశాత్తు ఈసారి పరిస్థితి వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏదీ ఎల్లకాలం ఒకే తీరున ఉండదు కదా? ఈసారి వికటించటానికి కారణాలున్నాయి. నీట్ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకుల అంశం. అసలే కుంగిపోయిన ఉన్న వారిని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించి గాయపరచాయి. వారిని ఏకం చేసేందుకు ముక్కు మొహమైనా తెలియని ఒక యువకుని పిలుపు ఎండుగడ్డికి అగ్గిపుల్ల వలే పనిచేసింది. వారిచ్చిన నిరసన కార్యక్రమంపట్ల అహంకార పూరితమైన నిర్లక్షం పెట్రోల్‌వలే పడింది. అణచివేతలు మరింత మరింత ఆజ్యంగా మారుతున్నాయి.
మౌలిక సమస్యలు దీనంతటిలో ఉన్నాయి. ప్రభుత్వపు ఇదే ధోరణి కారణంగా ఈ ఉద్యమపు పరిధి నీట్‌కు మించి విస్తరిస్తుండటం గమనించదగ్గ విషయం. కేవలం ఈ పరీక్ష గాక, అసలు దేశంలో పరీక్షల వ్యవస్థ, విద్యా విధానాలను సంస్కరించటం అవసరమని, తాము అందుకు కూడా ఉద్యమించగలమని కాక్‌రోచ్ ప్రతినిధులు ప్రకటిస్తున్నారు. అంతకుమించి గమనార్హమైన మాటలు కూడా వారినుంచి వినవస్తున్నాయి. గత పదేళ్లుగా హిందూ, ముస్లిం, ఇండియా పాకిస్థాన్ వాదనలతో యువతను, ప్రజలను తప్పుదారి పట్టించారని వారంటున్నారు. సంఘ్ పరివార్‌కు పెద్ద సెంటిమెంటల్ అస్త్రాలుగా ఉపయోగపడుతున్న ఈ కోణాన్ని తాకడం సాహసమే. అట్లానే వారు దేశంలో పేదరికాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. ఈ అంశాలు అన్నింటికి అన్నీ యువతను, టీనేజర్ బాలబాలికలను కూడా కదిలిస్తున్నట్లు జంతర్‌మంతర్ నుంచి వెలువడుతున్న వందలాది యూట్యూబ్ పోస్టులు చూపుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆశలు కూడా కలిగిస్తున్నాయి.
రోజు రోజుకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ కథనాలు వెలువడుతూ, మొత్తం సమాజమే కదులుతూ ప్రధాని మోడీకి తీవ్ర అప్రతిష్ఠాకరమవుతున్నాయి. తనను తాను విశ్వగురువుగా చాటుకునే మోడీ ఈ ఒత్తిడిని తట్టుకోలేక కావచ్చు, 23వ తేదీన ఈ కేసులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ప్రకటన చేస్తారు. కాని అది చాలదు. అణచివేతను వెంటనే ఆపివేయటం, సమస్య మూలాలకు పరిష్కారం వెతకటం అవసరం.
- టంకశాల అశోక్ (దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)











