గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్ ఘోర తప్పిదానికి పాల్పడింది. నాప్‌కిన్‌పై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత బాక్సర్ లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదరు రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లవ్లీనాతో పాటు పలువురు భారత అథ్లెట్లు రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లారు. ఆ సమయంలో ‘మిస్టర్ సింగ్స్ ఇండియా’ అని అసంపూర్తిగా ఉన్న భారత మ్యాచ్‌ను లవ్లీనా గమనించారు. భారత మ్యాప్‌లో కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేకుండా ముద్రించారని పేర్కొన్నారు.

‘‘మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆ మ్యాప్‌లో ముద్రించలేదు. భారత్‌లోని ప్రతి భాగం ముఖ్యమైందే’’ అని లవ్లీనా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమెకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్రాలే కాదు.. ఆ మ్యాప్‌లో కశ్మీర్ కూడా అసంపూర్తిగా ఉందని తెలిపారు. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని రెస్టారెంట్ ప్రతినిధులను డిమాండ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ రెస్టారెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.