
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అస్సాం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం, బాల్యవివాహాల కట్టడి, సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున ‘ది యూనిఫాం సివిల్ కోడ్, అస్సాం2026 బిల్లును’ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
వివాహం, విడాకులు, లివ్-ఇన్ రిలేషన్‌కు సంబంధించిన చట్టాలను ఏకీకరించి, సరళీకరించడం ఈ బిల్లు లక్ష్యం. పురుషులకు వివాహ వయస్సు కనిష్టంగా 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు. బహుభార్యాత్వాన్ని నిరోధిస్తుంది’ అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ బిల్లులో వివరించారు. తొలిసారి సహజీవనానికి చట్టబద్ధత కల్పించామని, రిజిస్ట్రేషన్ ద్వారా భాగస్వామల హక్కులకు పరిరక్షణ లభిస్తుందని, వారికి పుట్టే పిల్లలకు గుర్తింపు, రక్షణ ఉంటుందని చెప్పారు. అస్సాంలోని గిరిజనులను బిల్లు నుంచి మినహాయించినట్టు పేర్కొన్నారు.











