
బొద్దింకల పార్టీ ఎట్టకేలకు మోడీ ప్రభుత్వ మొండితనాన్ని ఎండగట్టడంలో విజయం సాధించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం తప్ప, పేపర్ లీక్‌ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. ఇక ధర్మేంద్ర విషయమై నిర్ణయానికి రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీలు లభించడంతో పర్యావరణ ఉద్యమ నాయకుడు వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను గురువారం రాత్రి విరమించిన సంగతి తెలిసిందే. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీల నివారణకు పటిష్టమైన ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ పరిణామాల సంగతి ఎలా ఉన్నా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలన్నదే. అలాగే కాంగ్రెస్ తదితర విపక్షాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే పార్లమెంట్‌లో చర్చల్లో పాల్గొంటామని ఘంటాపథంగా వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సిందే. విద్యారంగ అస్తవ్యస్త పరిస్థితిపైనే కాక్రోచ్ జనతా, ఇతర యువ విద్యార్థుల, తల్లిదండ్రుల ఆగ్రహం. అందుకనే ఎన్ని ఆంక్షలు, నిషేధాలు అడ్డంకి అయినా వాటిని ఛేదించుకుని జంతర్‌మంతర్‌కు లక్షలాది మంది తరలి వచ్చి ఆందోళనలో పాలుపంచుకోవడం బహుశా ఇటీవల కాలం లో ఎప్పుడూ జరగలేదు. విద్యావంతులైన యువతలో పేరుకుపోయిన నిరాశా నిస్పృహలే ఆందోళన జ్వాలలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నిరసనలకు దారి తీసిన అవకతవకలపై మోడీ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవలసింది పోయి వారిని దేశద్రోహులుగా ముద్రవేసే రాజకీయ కుట్రకు మళ్లీ తెరతీసింది. విద్యారంగంపై నిజాయితీతో కూడిన చర్చలకు దూరంగా ఉండడం, బాధ్యత వహించకుండా తప్పించుకోవడం మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొదటి నుంచి అనుసరిస్తున్న విధానాలు. ఎవరితోనూ ఏకాభిప్రాయం కోరకుండా, పార్లమెంట్‌లో చర్చలకు అవకాశం లేకుండా కావాలనే ప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020ని తీసుకు వచ్చింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పార్లమెంట్‌కు జవాబుదారీ లేని ఒక వ్యవస్థగా రూపొందించింది. ఈ వ్యవస్థ లోని లోపాలను గుర్తించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్‌టిఎ బలోపేతానికి కొన్ని సిఫార్సులు చేసినా కేంద్ర విద్యామంత్రి పట్టించుకోలేదు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ లోని సభ్యులు విపక్షాలకు చెందిన వారు కావడమే. రాజకీయ వైషమ్యానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప పరీక్షల వ్యవస్థను మెరుగుపర్చాలన్న లక్షానికి అవకాశం ఇవ్వలేదు. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సియుఇటి) ద్వారా పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక ఎన్‌టిఎ తనకు తాను ఒక నిస్సహాయ వ్యవస్థగా దీర్ఘకాలంగా సిబ్బంది కొరతతో సతమతమవుతున్న సంస్థ. పరీక్షలను నిర్వహించడానికి పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల బృందంపై ఆధారపడుతోంది. ప్రశ్నపత్రాలను తయారు చేసేవారు, తర్జుమాదార్లు, నిపుణులు.. వీరంతా ఎన్‌టిఎ నియామక సిబ్బందే. వీరు దేశం లోని ప్రముఖ సంస్థల నుంచి పేరుగాంచిన విద్యావేత్తలు కానేకారు. వీరిలో చాలా మంది సామాన్య ప్రతిభ గలిగినవారే ఉన్నారు. అదీకాక వీరిలో చాలామంది రాజకీయ నేతల సిఫార్సులతో వచ్చినవారు. ఇలాంటి లోపభూయిష్టమైన ప్రక్రియ ఫలితంగానే ఎన్నో వైఫల్యాలు ఎదురవుతున్నాయి.
గత 12 ఏళ్లలో దేశం మొత్తం మీద 152 పేపర్ లీక్‌లు సంభవించగా వీటిలో తొమ్మిది ఎన్‌టిఎ పరీక్షలకు సంబంధించినవి కావడం గమనార్హం. అంటే 2017లో ఎన్‌టిఎ ఏర్పాటైన దగ్గరనుంచి గత పదేళ్లలో ఆ సంస్థకు చెందిన తొమ్మిది పేపర్ లీక్‌లు బయటపడ్డాయి. 2003 కామన్ అడ్మిషన్ టెస్ట్ (సిఎటి) పేపర్ లీక్‌కు సంబంధించిన రెండు కేసులు కూడా గత రెండు దశాబ్దాలుగా సిబిఐ దర్యాప్తులో పెండింగ్‌లో ఉన్నాయంటే పేపర్ లీక్‌లపై ప్రభుత్వాలు ఎంత మొద్దునిద్ర వహిస్తున్నాయో తెలుస్తోంది. ప్రస్తుత విద్యావిధానంలో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. అయినా సరే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలు సరిగ్గా లభించడం లేదు. నైపుణ్యంతో కూడిన విద్య లభించడం లేదు. ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత ప్రపంచంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు నైపుణ్యం సాధించే అవకాశాలు విద్యార్థులకు అందుబాటు కావడం లేదు.
యువగ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు సరాసరిన 40 శాతం వరకు పెరిగింది. కొన్ని ఉద్యోగాల్లో పోటీ తీవ్రంగా ఉంటోంది. వాటితో పోటీపడడం సామాన్య విద్యార్థులకు సాధ్యం కావడం లేదు. ఉన్నత విద్య కోసం కుటుంబాలు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాయో తెలిసిందే. నీట్ పరీక్ష కోసం దేశం లోని కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం డబ్బు, కేంద్ర ప్రభుత్వం విద్యపై వెచ్చించే బడ్జెట్‌తో సమానంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో నీట్ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతుంటే యువత ఎలా తట్టుకోగలుగుతుంది.ఇన్ని ఘోర వైఫల్యాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిలోనే కొనసాగడం, ప్రధాని మోడీ ఆయనపై ఈగ వాలనీయకుండా కాపాడుతుండడం కాక్రోచ్ జనతా పార్టీ నేతలకే కాదు విద్యార్థి లోకానికే తీరని భావోద్వేగాలకు దారితీస్తోంది. విద్యావ్యవస్థ కుప్పకూలడానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్షం, ఆత్మవంచన, జవాబుదారీతనం లోపించడం, తనమాటకు ఎదురులేదనే నియంతృత్వం కారణమని, ఇది బూటకపు ప్రభుత్వమని కాక్రోచ్ జనతా పార్టీ కదం తొక్కుతోంది.











