
మన తెలంగాణ/బోడుప్పల్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజుపై అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) కేసు నమోదు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు సంబంధించిన కార్యాలయం, బంధువులు, సహచరులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో బోడుప్పల్‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్, కీసరలో రెండు ప్లాట్లు సహా మొత్తం ఐదు ప్లాట్లు రూ.15.77 లక్షల విలువ, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి రూ.8 లక్షలు, నగదు రూ.10.03 లక్షలు గుర్తించారు. అలాగే ఎల్‌ఐసీ, మ్యాక్స్ లైఫ్ పాలసీల్లో సుమారు రూ.19.86 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాల విలువ సుమారు రూ.40 లక్షలు, పోస్టాఫీస్‌లో పొదుపు రూ.20.86 లక్షలు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు సుమారు రూ.37.23 లక్షలు, ఇంటి సామగ్రి రూ.10.67 లక్షలు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలను ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు బదిలీలు
అధికారి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఎసిబికి కీలక వివరాలు లభించినట్లు తెలిపింది. డ్రైవర్ ఖాతా నుంచి అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు పలుమార్లు మొత్తం రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి.. అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ విచారణలో వెల్లడించినట్లు ఎసిబి పేర్కొంది. ఈ లావాదేవీల మూలాలు, ఉద్దేశం, అక్రమ గ్రాటిఫికేషన్‌కు సంబంధం ఉందా.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.3,06,53,177గా ఎసిబి వెల్లడించింది. మరిన్ని ఆస్తులపై కూడా తనిఖీలు, ధ్రువీకరణ కొనసాగుతున్నాయని వివరించింది. గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ విలువ అధికారిక డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉ0ందని ఎసిబి పేర్కొంది.కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.











