న్యూఢిల్లీ: నేపాల్‌ను వరదలు ముంచెత్తి జలప్రళయం సృష్టించడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వరదల్లో సుమారు 1,600 మంది గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తుండగా, వీరిలో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదు. మరోవైపు మృతుల సంఖ్య 362కు చేరుకుంది. టిబెట్‌లో బుధవారంనాడు మంచు చరియలు విరిగిపడి అక్కడి నదిలో పడిన వరద దిగువనున్న నేపాల్‌ను ముంచెత్తింది. భోటేకోశి నదిలోకి ప్రవాహం వచ్చి చేరడంతో బురదతో కూడిన వదన నీరు ఊళ్లను ముంచెత్తింది. కీలకమైన వంతెనలు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి, మూడు జిల్లాలు అతలాకుతమయ్యాయి. వేలాది మంది ఆచూకి తెలియకపోవడంతో వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాయి.

నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజిమెంట్ అధారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరదల్లో సుమారు 826 మంది జాడ గల్లంతైంది. వారిలో 590 మంది టూరిస్టులు ఉన్నారు. తాజా రెస్క్యూ ఆపరేషన్‌లో మరో 93 మృతదేహాలను వెలిగి తీసినట్టు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. చిత్వన్‌లో 108, నావల్‌పరాసీ ఈస్ట్‌లో 62, ధాదింగ్‌లో 27, గోర్ఖాలో 20, రసువాలో 17, నావాల్‌పరాసి వెస్ట్‌లో 15, నువాకోట్‌లో 12, తనహున్‌లో తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు నేపాల్ పోలీస్ ప్రతినిధి అభి నారాయణ్ కఫ్లే తెలిపారు. క్షతగాత్రులతో సహా పలుచోట్ల నిలిచిపోయిన 800 మందిని ప్రభావిత ప్రాంతాల నుంచి రక్షించినట్టు చెప్పారు. వేలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయాయనీ, ఇప్పటికీ ఆనేక మంది ఆచూకీ తెలియలేదని వివరించారు. విపత్తు స్థాయిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం గల్లంతైన వారిలో 44 మంది ఆర్మీ సిబ్బంది, 28 మంది నేపాల్ పోలీసు సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు దళ సిబ్బంది ఉన్నారు. వివిధ జలవిద్యుత్, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 160 మంది గల్లంతయ్యారు.

కీలక మార్గాలు తెరిచేందుకు చర్యలు

వరదల కారణంగా మధ్య నేపాల్‌లో 35 మోటారు వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్లు తారురోడ్డు దెబ్బతిన్నాయి. రసువాలో సంభవించిన వరదల కారణంగా ధాగింగ్‌లో మూసుకుపోయిన గల్ఛీ-బైరేని రహదారిన తెరిచేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఖాట్మండును నేపాల్‌లోని ఇతర ప్రాంతాలతో కలిపే ఈ రహదారి అత్యంత కీలకమైనంది. రహదారిపై పేరుకుపోయిన శిధిలాలను తొలగించేందుకు సాయుధ పోలీసు దళ సిబ్బంతో పాటు స్థానిక ప్రజలను మోహరించారు. రాకపోకలను పునరుద్ధరించేందుకు వారు శ్రమిస్తున్నారు.

27 మంది పర్యాటకులను కాపాడిన అధికారులు

మరోవైపు, ఈ విపత్తులో 590 మంది పర్యాటకుల ఆచూకీ లేకుండా పోయినట్టు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. వీరిలో 476 విదేశీయులు, 114 మంది నేపాలీలు ఉన్నారు. వీరంతా అమెరికా, కెనడా, దక్షిణాఫ్రియా, బ్రిటన్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర 30కి పైగా దేశాలకు చెందిన వారున్నారు. గల్లంతైన భారతీయ పర్యాటకుల్లో ఎక్కువమంది టిబెట్‌లోని కైలాస్ మనసరోవర్, నేపాల్‌లో బాగ్మతి ప్రావిన్స్‌లో ఉన్న గోసాయిస్‌కుండకు వెళ్తున్న వారని అధికారులు తెలిపారు. వరద ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు నదీతీరాలు, దిగువ ప్రాంతాలను జల్లెడ పడుతూ గల్లంతైన వారి కోసం వెదుకుతున్నారు. రసువాలో చిక్కుకుపోయిన 27 మంది విదేశీ పర్యాటకులను అధికారులు గురువారం రక్షించారు. వీరిలో 11 మంది భారతీయులు, నలుగురు దక్షిణ కొరియన్లు, ఇద్దరు ఇటాలియన్లు, ఇద్దరు అమెరికన్లు ఉన్నారు. తక్కిన 8 మంది జాతీయత ఇంకా నిర్ధారణ కాలేదని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. నేపాల్ ఆర్మీ సహాయంతో వారిని విమానంలో ఖాట్మండుకు తరలించారు.

టిబెట్ ప్రాంతంలో భూకంపం వల్లే..

నేపాల్ విదేశాంగ మంత్రి ఖానాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని, మూడు నిమిషాల తర్వాత ఆకస్మిక వరదల సమాచారం అందిందని అన్నారు. ఈ ప్రకంపన కారణంగానే హిమానీనందం నుంచి ఆకస్మాత్తుగా నీరు విడుదలకై వరదలకు దారితీసి ఉండొచ్చని అన్నారు. టిబెట్ ప్రాంతంలో పొంచి ఉన్న ప్రకృతి విపత్తు గురించి తమను చైనా ముందుగా హెచ్చరించలేదని నేపాల్ అధికారులు చెప్పినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలవడ్డాయి. భూకంకాల సమయంలో కొండచరియలు విరిగి నదీ ప్రవాహానికి అడ్డుగా ఓ డ్యామ్‌లా పేరుకుపోయి డిజాస్టర్ డ్యామ్స్ ఏర్పడతాయని, అవి ఏ కారణంతోనైనా తెగిపోతే అప్పటి వరకూ నిలిచి ఉన్న భారీ జలరాశి ఒక్కసారిగా విరుచుకుపడి దిగువనున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రళయం సష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేపాల్ ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ముప్పు ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మాపై నిందలొద్దు: చైనా అభ్యంతరం

అయితే నేపాల్‌లో వరదలకు తామే కారణమన్న వార్తలను బీజింగ్ తోసిపుచ్చింది తమపై నిందలేస్తే ప్రయోజనం లేదని, ఈ ప్రమాదంలో అనేక మంది చైనీయులు కన్నుమూశారని తెలిపింది. పత్తుకు మూలం నేపాల్ భూభాగంలోనే ఉందని నేపాల్‌లోని చైనా ఎంబసీ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. నేపాల్ వైపునే హిమనదం, మంచిచరియలు విరిగిపడటం, లేదా భూకంపం సంభవించడంతోనే ఈ విపత్తు ముంచెత్తిందని పేర్కొంది. కాగా, టిబెట్‌లో ఎలాంటి భూకంపం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొండచరియలు, మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడటంతోనే భూమి కంపించి రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదైందని తెలిపింది. దీంతో అసలు ఏం జరిగిందనే సస్పన్స్ కొనసాగుతోంది. కాగా, నేపాల్‌లో తీవ్ర వరద ప్రభావ ప్రాంతాల్లోబురద, రాళ్లు పేరుకుపోవడంతో పలుచోట్ల రహదారులు మూసుకు పోయాయి.

మరికొన్ని చోట్ల వరదల కారణంగా తలిత్తే ప్రమాదాల దృష్ట్యా రవాణాను నిలిపివేశారు. ఖాట్మండులోని నాగ్‌ధుంగా నుంచి ముగ్లింక్ వరకూ ఉన్న జాతీయ రహదారిలో ఒక భాగంలో రాకపోకలను నిరవధికంగా పూర్తిగా నిలిపివేశారు. పలు జిల్లాలను ఖాట్మండుతో అనుసంధానించే మరో కీలక రహదారి ఇది. ఇప్పటికే ఆచూకీ తెలియని వారి సంఖ్యను, విపత్తు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న భద్రతాధికారలు, విపత్తు నిపుణులు.. ఈ ఆకస్మిక వరదలు నేపాల్‌లో అనేక సంవత్సరాల్లో సంభవించిన అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు. 1993లో సర్లాహీ, రౌతహట్, మక్వాన్‌పూర్ జిల్లాల్లో సంభవించిన వరదల్లో 1,400 మంది మరణించిన తర్వాత జరిగిన విపత్తులన్నింటినీ ఇది అధిగమించే అవకాశం ఉందని వారంటున్నారు.