
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేం ద్ర జల సంఘం (సీడబ్లూసీ) చైర్మన్ అధ్యక్షతన సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగా ణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారు లు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి మే 26 వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టి కి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ముఖ్యమంత్రి ఆగస్టు 5వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌కు ప్రత్యేకంగా లేఖ రాసి కేం ద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్ వ్యయం పెరుగుతుందని తెలంగాణ ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. తక్కువ విద్యుత్ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్ర యోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నది తె లంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంచడం వల్ల అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వివరించింది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది.








