బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండేళ్లు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగారు. మాజీ ప్రధానమంత్రి, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు షాబుద్దీన్ సన్నిహితుడు. ‘తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. గుండె, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. ఇటీవలి వైద్య పరీక్షల్లో న్యూరో సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా విధుల్లో కొనసాగలేను’ అని స్పీకర్‌కు రాసిన లేఖలో షాబుద్దీన్ పేర్కొన్నారు. హసీనాపై బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత షాబుద్దీన్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ ఆహ్మద్ కొనసాగనున్నారు.