కొచ్చి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత పర్యటనలో ఉన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం ఆయన కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు బారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మైఖెల్ బౌలోస్ అలప్పుళలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేరళ ముఖ్యమంత్రి సతీశన్‌తో మైఖెల్ చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిని సిఎం కార్యాలయం ఖండించింది. సతీశన్ అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో మాత్రమే చర్చలు జరిపారని.. వాటిలో ట్రంప్ అల్లుడు లేడని స్పష్టం చేసింది. ఈ పర్యటనపై అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ మైఖెల్.. తమ రాయబారి సెర్గియో గోర్ దశాబ్ద కాలంగా మంచి స్నేహితులని తెలిపింది. ఆయనను కలిసేందుకే ఈ ఏడాది రెండోసారి భారత పర్యటనకు వచ్చారని వెల్లడించింది. కాగా, ఈ ఏడాది మేలో కూడా మైఖెల్ తన సతీమణి, ట్రంప్ కుమార్తె టిఫానీతో కలిసి భారత్‌లో పర్యటించారు.