పోచంపల్లి ఇక్కత్ చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్షమని మిస్ అసియా, చేనేత హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్ అన్నారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లోని చేనేత మ్యూజియం, కార్మికుల గృహాలు, కళాపునర్వి చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ యూనిట్‌ను ఆమె శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేతతో పాటు, రూరల్ టూరిజంను ప్రోత్సహించేందుకు బృహత్తర కార్యాచరణలో భాగంగా 40 మంది 4 బృందాలుగా విడిపోయి పోచంపల్లి చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించినట్లు చెప్పారు. లండన్‌లో సెప్టెంబర్ 25న జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలో పోచంపల్లి చేనేత పట్టువస్త్రాలు, కళాకారులు,కార్మికుల శ్రమ గురించి ప్రపంచ నాయకులకు వివరించనున్నట్లు తెలిపారు. యూఏఈ, యూరప్ దేశాల్లో పోచంపల్లి వస్త్రాలు, కర్టెన్లు, సోఫా కవర్లు, టేబుల్ క్లాత్‌కు డిమాండ్ ఉందన్నారు.యువత రోజువారి అవసరాలకు తగ్గట్టుగా చేనేత ఉత్పత్తులను నేరుగా విదేశాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తే

నేత కార్మికులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. ప్యాష్ డిజైన్ల కళాశాలల్లో గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా సిలబస్ మార్చాలని అభిప్రాయ పడ్డారు. చేనేత ఇక్కత్ వస్ర్త ఉత్పత్తుల విశిష్టత, భూదాన ఉద్యమ చరిత్ర,గ్రామీణ జీవన విధానాన్ని క్రియేటివ్ ఎకానమీ ఇంపాక్ట్ కలెక్టివ్ సంస్థ ప్రత్యేక టూరింజం మోడల్‌ను రూపొందిచిందని సీఈఐసీ వ్యవస్థాపకురాలు సాహితి తెలిపారు. ప్రజలకు పోచంపల్లి చేనేతను చేరువ చేసేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు, పర్యాటకులను రప్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తడ్క వెంకటేశ్వర్లు, టై అండ్ డై సంఘం అధ్యక్షుడు కర్ణాటి బాలరాజ్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్, జిల్లా ఏడీ శ్రీనివాస్, టైఅండ్ డై మాజీ అధ్యక్షుడు తడ్క రమేష్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అకం పాండు తదితరులు పాల్గొన్నారు.