హైదరాబాద్: క్షుద్రపూజలు అంటూ కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నదని కెటిఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని అన్నారు. తాము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం.. తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళం అని, తమకు క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటామన్నారు. కాంగ్రెస్ మాదిరిగా తమకు క్షుద్ర రాజకీయావు తెలియదని అన్నారు. హరీష్ రావు గుడికి వెళితే తప్పా..? అని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని కెటిఆర్ చెప్పారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి తమది కాదని అన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. తాము ఏ సబ్ స్టేషన్‌కైనా రావడానికి సిద్ధం అని, 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుణ యాగాలు సహా పలు అంశాలపై స్పందిస్తూ.. యాగాలు చేయొచ్చు కానీ.. ప్రభుత్వం కూడా తన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. దైవకృపకు మానవ ప్రయత్నం కూడా ఉంటేనే ఫలితం వస్తుంది. వ్యవసాయం, రైతుల పట్ల సిఎం రేవంత్ రెడ్డికి పట్టింపు, అవగాహన లేవు అని ఆరోపించారు. పాలమూరు బిడ్డగా చెప్పుకొనే ఆయన.. ఆ జిల్లాకు సాగునీరు ఇవ్వట్లేదని అన్నారు.రైతులకు అవసరమైన సమయంలో పంపులు ఆన్ చేయడం, సాగునీటి ప్రణాళికలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.పక్క రాష్ట్రం నీటిని ఎత్తుకుపోతుంటే ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రంగా విమర్శించారు.