న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విజన బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య శనివారం మాటల యుద్ధం చోటుచేసుకుంది. మహిళా శక్తిని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఒక విడియో సందేశం ఇవ్వగా, కాంగ్రెస్ నుంచి ఎట్టకేలకు ఓ సానుకూల సందేశం వచ్చిదంటూ కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదకగా స్పందించారు. రాహుల్ గాంధీ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మహిళా శక్తిని కొనియాడారు.

భారత మహిళల శక్తి బందీగా ఉండపోయిందని, తమను తాము వ్యక్తపరచుకనే స్వేచ్ఛ వారికి ఉండాలని అన్నారు. వారు కనీసం వీదుల్లో సౌకర్యవంతంగా నడవలేకపోతున్నారని అన్నారు. మహిళల భాగస్వామ్యం, తగిన స్వేచ్ఛ లేకుంటే ఏదేశం కూడా విజయం సాధించలేదని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. దీనిపై కిరణ్ రిజిజు వెంటనే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కనిపిస్తోందని, ప్రతిపాదిత మహిళా బిల్లుకు బేషరతుగా ఆ పార్టీ మద్దతిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. దీనిపై రాహుల్ మరోసారి స్పందించారు. ‘మిస్టర్ రిజిజు.. కాంగ్రెస్ సపోర్ట్‌తోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం పార్లమెంటరీ వ్యహారాల మంత్రిగా మీ కంటే ఎవరికి బాగా తెలుసు? బిల్లు ఆమోదించి మూడేళ్లయినా ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేకపోయారు? దీనికి డీలీమిటేషన్‌తో అనవసరంగా ఎందుకు ముడిపెడుతున్నారు’ అని నిలదీశారు. 2023 చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని సూచించారు.

ఎవరి వాదన వారిదే

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే కల్పించేందుకు పార్లమెంటులో ఆమోదం కోసం కేంద్రం మరోసారి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతమున్న 543 లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించి 816కు పెంచే యోచనలో ఉంది. దీన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజక వర్గాలకే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని విపక్షాలు అంటున్నాయి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని విమర్శిస్తున్నాయి.