
గత 24 గంటల్లో నాలుగుసార్లు చర్చలకు ఆహ్వానం
సమస్యలకు సంభాషణ ద్వారానే పరిష్కారం..
విద్యార్థుల సూచనలకూ ప్రభుత్వం సిద్ధమే..
న్యూఢిల్లీ: నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విజ్ఞప్తి చేశారు. సమస్యలకు పరిష్కారం, ముందడుగు రెండూ సంభాషణ ద్వారానే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. పీటీఐ వీడియోస్‌తో మాట్లాడుతూ.. గత 24 గంటల్లోనే ప్రభుత్వం కనీసం నాలుగుసార్లు సీజేపీని చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులు, యువత మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వ తరఫున వినయపూర్వకంగా కోరుతున్నాను. మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అని అన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరుగుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. నడ్డా అధికారిక నివాసంలో గానీ, ఆయన కార్యాలయంలో గానీ సమావేశం నిర్వహించవచ్చు. ఏ ప్రదేశం కావాలన్నది విద్యార్థి ప్రతినిధులే నిర్ణయించుకోవచ్చు. నేను కూడా సమావేశానికి హాజరవుతాను అని తెలిపారు.
నీట్ అంశంతో పాటు దానికి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక గంటైనా, రెండు గంటలైనా, మూడు గంటలైనా, నాలుగు గంటలైనా... మీకు ఎంత సమయం అవసరమైతే అంత సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి చర్చలకు ముందుకు రండి. చర్చలు లేకుండా పరిష్కారం దొరకదు. పరిష్కారం లేకుండా ముందుకు వెళ్లలేం అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై అత్యంత సున్నితంగా స్పందిస్తున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇలాంటి కేసుల్లో నిందితులపై వేగంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే ఇదే తుది నిర్ణయం కాదని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వరుసగా మరిన్ని చర్యలు తీసుకుంటుందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. మీ సూచనలు, సలహాలు కూడా మాకు చెప్పండి. కలిసి ముందుకు సాగుదాం. ఇది మా ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కాదు. సంభాషణ ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుంది అని ఆయన పునరుద్ఘాటించారు. నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.











