నా భార్య పిల్లల్ని ఏమి అనొద్దు..

దెయ్యమైన వాళ్లను మంచిగా చూసుకుంటా...!

సూసైడ్ నోట్‌లో కానిస్టేబుల్ భావోద్వేగం

నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు

ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని డిజిపి కార్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. డిజిపి కార్యాలయంలోనే ఒక కానిస్టేబుల్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో కార్యా లయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న సహచ ర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా ఆయన అప్పటికే మృతిచెందినట్లు సమాచారం.

ఘటనా స్థలంలో పోలీసులు నిర్వహిం చిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్‌లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, వారు చాలా మంచి వారని స్వామి పేర్కొ న్నారు. అంతేకా కుండా, తాను చనిపోయి దయ్యం అయినా కూడా తన భార్య, పిల్లలను చూసుకుంటాను అంటూ భావోద్వేగ పూరితంగా రాశా రు. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణం లో విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. డిజిపి కార్యాల యం లాంటి హైసెక్యూరిటీ జోన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్‌లకు బానిసై అప్పుల బాధతో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.