న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో భద్రతా కారణాల రీత్యా ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రెండో రోజైన గురువారంనాడు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు వందలాది మంది ఎక్కడికక్కడే నిలిచిపోగా, కొందరు ఖరీదైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగిస్తుండటంచో కీలక మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నిర్ణయించింది.

లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ్, జన్‌పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాఘ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ మూసివేయనున్నట్టు డీఎంఆర్‌సీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. ఆ తర్వాత ఝుండేవాలన్ మెట్రో స్టేషన్ సర్వీసును కూడా డీఎంఆర్‌సీ మూసివేసింది. బుధవారంకూడా ఈ 17 మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి.