
న్యూఢిల్లీ: నేపాల్ లో ఆకస్మిక వరద ప్రళయంతో మృతి చెందిన వారి సంఖ్య 538కి చేరింది. వరదల్లో వందల మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద ప్రభావిత నేపాల్‌లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, గల్లంతైన 320 మంది భారతీయుల ఆచూచి ఇంకా లభించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) శుక్రవారం తెలిపింది. అలాగే భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకి కూడా తెలియరాలేదని పేర్కొంది. గల్లంతైన వారి పలు జాబితాలను అధికారులు సరిపోల్చే పనిలో ఉందని చెప్పింది. ఆకస్మిక వరదల వల్ల ప్రభావితమైన భారతీయులను సంప్రదించడానికి, వారి తరలింపును సమన్వయం చేయడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతం నుండి కాఠ్మండుకు చేరుకున్న 21 మంది భారత పౌరులు ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారని, నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ కాఠ్మండులో ఈ బృందాన్ని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని జైస్వాల్ తెలిపారు.
ఈ విషాదం నేపథ్యంలో నేపాల్‌కు భారత్ అన్ని విధాల సహాయం అందిస్తుందని.. మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని జైస్వాల్ తెలిపారు. ఇప్పటికే సహాయక సామగ్రితో రెండు విమానాలు నేపాల్ కు బయలుదేరాయని.., మూడో విడత సహాయక సామగ్రి ఈ సాయంత్రం బయలుదేరనుందని ఆయన చెప్పారు. నేపాల్ అభ్యర్థన మేరకు, భారతదేశం ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోందని, ఇందుకోసం అవసరమైన పరికరాలను అంచనా వేయడానికి ముందుగా ఒక రెక్కీ బృందాన్ని పంపిస్తున్నామని ఆయన తెలిపారు. "ఒక వైద్య బృందాన్ని కూడా పంపిస్తున్నాము. దీనికి అదనంగా, నేపాల్‌లోని ప్రభావిత ప్రాంతాలలో కనెక్టివిటీని త్వరగా పునరుద్ధరించడానికి వీలుగా, వాటికి సంబంధించిన సాంకేతిక బృందాలతో పాటు బెయిలీ వంతెనలను కూడా అందించాము. ఒక బెయిలీ వంతెన ఇప్పటికే నేపాల్‌లో ఉంది.. దానిని సహాయక చర్యల కోసం ఉపయోగించవచ్చు" అని జైస్వాల్ పేర్కొన్నారు.











