ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని, పైగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అక్కడికి వెళ్ళడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పేరుతో బిఆర్‌ఎస్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ’ధర్నా చౌక్’నే ఎత్తివేసిన దౌర్భాగ్యపు చరిత్ర బిఆర్‌ఎస్‌దని ఆయన తూర్పారపట్టారు. అలాంటి పార్టీకి ఈరోజు ధర్నా చౌక్ వద్ద మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు.

పేపర్ లీకేజీలపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 పరీక్షల లీకేజీలతో పాటు నియామకాలే జరగని పరిస్థితి నెలకొందన్నారు. గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో పడి 27 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా కలిసి, కేంద్ర ప్రభుత్వ హామీతో విరమింపజేశారని రాంచందర్ రావు తెలిపారు.