దేశంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయాలు సరిగా అందని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అన్నారు. “భారత్‌లో అత్యంత తక్కువ స్థాయిలో సేవలు అందుతున్న ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఎంతో ఉపయోగపడుతుంది” అని మస్క్ గురువారం సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశంలోని మారుమూల గ్రామాలకు స్టార్‌లింక్ సేవలను అందించాలని ‘డోజ్‌ డిజైనర్’ అనే ఎక్స్ ఖాతా చేసిన పోస్టుకు ఆయన స్పందించారు. “2026 మే నాటికి భారత్‌లో జాబితాలో ఉన్న 11,256 గ్రామాలకు ఇంకా 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రాలేదు” అని డోజ్‌డిజైనర్ పేర్కొంది. 2026 మార్చి నాటికి దేశంలో 109.3 కోట్ల ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్లు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవి 44.087 కోట్లు మాత్రమేనని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందికి 48.31 ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 126.80గా ఉందని వివరించింది.


భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు స్టార్‌లింక్ తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు స్టార్‌లింక్ జెన్-2 ఉపగ్రహ నెట్‌వర్క్‌కు అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తును ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తిరస్కరించింది. ఆ నెట్‌వర్క్‌లోని కొన్ని సదుపాయాలు, అది ఉపయోగించదలిచిన రేడియో ఫ్రీక్వెన్సీలు భారత నిబంధనలకు అనుగుణంగా లేవని అధికారులు పేర్కొన్నారు.జెన్-2 వ్యవస్థలో నేరుగా మొబైల్ పరికరాలకు కనెక్టివిటీ అందించే సదుపాయం కూడా ఉంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్.. భూమికి సమీప కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాల సమూహం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతుల కోసం స్టార్‌లింక్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.