
అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వర్క్ ప్రోగ్రాంకు సంబంధించిన పిటిషన్ల పీజులు పెంచే, లేదా మార్పు చేసే ప్రతిపాదన వైట్‌హౌస్ నియంత్రణ సమీక్షను పూర్తి చేసుకుంది. దీంతో ఈ ప్రతిపాదన త్వరలో బహిరంగంగా ప్రచురితమై, అమలుకు మరింత దగ్గరవుతోందని అమెరికాకు చెందిన ‘బ్లూమ్‌బర్గ్ లా’ సంస్థ తెలిపింది. ప్రస్తుతం పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ ఫీజుల పెంపు, మార్పు జరిగితే భారతీయ నిపుణులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.బ్లూమ్‌బర్గ్ లా నివేదిక ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) రూపొందించిన ‘రిమ్ 1615-ఏడీ20’ అనే ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్‌ఏ) బుధవారంనాడు ఆమోదం తెలిపింది. రాబోయే వారాల్లో ఈ ప్రతిపాదనను డీహెచ్‌ఎస్ బహిరంగంగా ప్రచురించే అవకాశం ఉంది. అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులు అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు విస్తృతంగా ఉపయోగించే హెచ్-1బీ కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం
సమూలంగా మార్చే ప్రయత్నాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతానికైతే ఫీజులు ఎంత పెరుగుతాయి, ఏరకమైన హెచ్-1బీ పిటిషన్లకు వర్తిస్తాయి, కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది ఇంకా తెలియలేదు.కాగా, ఓఐఆర్‌ఏ పూర్తయినంత మాత్రాన ఫీజుల పెంపునకు అనుమతి లభించినట్టు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రజల ముందుకు పెట్టాక వారి అభిప్రాయల ఆధారంగా డీహెచ్‌ఎస్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం 4,06,348 హెచ్-1బీ వీసా పిటిషన్లు ఆమోదించగా, అందులో 2,91,542 పిటిషన్లు వీసా పొడిగింపునకు సంబంధించినవే కావడం విశేషం. వీటిలో భారతీయుల వాటా 77.6 శాతం ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి వీసా ఫీజులు పెరిగితే భారతీయ ఉద్యోగాలు అధికంగా పనిచేసే టెక్ కంపెనీలపై ఖర్చుల భారం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.











