హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడేప్పాడ్ గ్రామంలోని శ్రీరామాలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఆలయంలోని గర్భగుడి తాళాలు పగులగొట్టి రూ.2.43 లక్షల విలువైన 1080 గ్రాముల వెండి వస్తువులను దుండగులు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆత్మకూరు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ప్రాపర్టీ నేరస్తులను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.

వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన వెండి వస్తువులను వంద శాతం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు కల్లాకూరి కిరణ్‌బాబు పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 50కు పైగా ప్రాపర్టీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన సందీప్‌కుమార్‌గా గుర్తించారు.

కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్న ఆత్మకూరు పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆలయ చోరీతో ఆందోళన చెందిన గ్రామస్థులు, భక్తులు పోలీసుల తక్షణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.