హైదరాబాద్‌లో రోడ్‌సైడ్ పార్కింగ్, ఫుట్‌పాత్ ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో వాలెట్ పార్కింగ్ కారణంగా జరిమానాలు పడుతున్న ఘటనలు మళ్లీ చర్చకు వచ్చాయి. జూబ్లీహిల్స్, మాధాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ సరిపడా పార్కింగ్ లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. అయితే చలాన్లు మాత్రం వాహన యజమానులకే వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టు పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం హైదరాబాద్‌కు పెద్ద సమస్యగా మారింది.