నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కెటిఆర్ పిలుపు

పేదింట ఆడబిడ్డల పక్షాన గళాన్ని వినిపించాలని శ్రేణులకు ఆదేశం

ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీత

మనతెలంగాణ/హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు.హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ నేతలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కెటిఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన కెసిఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని తెలిపారు. కెసిఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని అన్నారు. కొవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కెసిఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు.

అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులే చెబుతున్నారని అన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెక్కులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు

కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా కెటిఆర్ మండిపడ్డారు. నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి వంటి హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదించే ప్రభుత్వం, ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును ఇప్పుడు సాకుగా చూపుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా నిలిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఇప్పటికే కెసిఆర్ హయాంలో అమలైన పలు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన కాంగ్రెస్, ఇప్పుడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను కూడా రద్దు చేయాలని చూస్తోందని విమర్శించారు.

ఆడబిడ్డ భారం కాదు.. భరోసా అనే భావనకు కెసిఆర్ ప్రభుత్వం రూపమిచ్చిందని అన్నారు. అలాంటి పథకాలను రద్దు చేస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తులం బంగారం వంటి హామీలతో ఓట్లు పొందిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని మరిచిపోయిందని మండిపడ్డారు.

నిరసనల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదింటి ఆడబిడ్డల పక్షాన తమ గళాన్ని వినిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి ఏమైంది..షాదీ ముబారక్ ఏమైంది.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారు..అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆడబిడ్డల కోసం కెసిఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను కాపాడుకుందాం.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయించేలా ఒత్తిడి పెంచేందుకు పోరాడుదాం అని పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు.