ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది

ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

 మేడారంలో వనదేవతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

 చేయూత పింఛన్ల చెక్కుల పంపిణీ.. వాటర్ ప్లాంట్ ప్రారంభం

 మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముచ్చట్లు

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: మేడారంలోని వనదేవతల ఆలయాన్ని అద్భుతంగా తయారుచేశామని, ప్రజా సంక్షేమమే లక్షంగా ప్రజాప్రభుత్వ పనిచేస్తుందని, ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి సర్కార్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ములుగు జిల్లాలోని ప్రముఖ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సిఎం పర్యటించారు. బిచ్కుంద నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. సిఎం రేవంత్ రెడ్డి మేడారంలోని వనదేవతలు సమ్మక్క----సారలమ్మల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను ప్రార్థించారు. ముందుగా మొక్కులో భాగంగా వనదేవతలకు నిలువెత్తు బంగారం(66 కిలోల బెల్లం) సమర్పించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 24 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత సామాజిక భద్రత పింఛన్లను ఆయన అందజేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున అందించే పింఛన్లకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొక్క నాటారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుని గట్టమ్మ ఆలయం వద్ద రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి, 2,145 రహదారుల అభివృద్ధి, 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల మహర్దశ అభివృద్ధి పైలాన్‌ను ఆవిష్కరించి.. నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు.

కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఎంపి బలరాంనాయక్, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. “మేడారం సమ్మక్క- సారలమ్మ దేవాలయాన్ని రామప్ప, వేయిస్తంభాల గుడి తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం. ములుగు జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి త్వరలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం. భక్తులకు సౌకర్యాలు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగుపై చెక్ డ్యామ్‌లు, స్నానఘట్టాల నిర్మాణం చేపట్టి జంపన్నవాగును సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. మహిళల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ములుగు జిల్లా యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆంగ్ల బోధన అందించడంతోపాటు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా యువతను తీర్చుదిద్దుతాం.

ములుగు జిల్లాలోని దండకార్యంలో గతంలో ప్రజాసమస్యలపై అన్నలు కొట్లాడేవారని.. ఇప్పుడు అన్నల నుంచి వచ్చిన ఆడబిడ్డ సీతక్క ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చుతున్నారు. సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నాం. కొందరు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. సొంత చెల్లినే బయటకు పంపారు. సొంత చెల్లికే న్యాయం చేయలేనివారు..రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా?. కొడుకు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు. సొంత బిడ్డను ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతుంటే మౌనంగా ఉన్నారు. కొడుకు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లే. అలాంటి తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు. ఇంకొకరు అఘోరారావు. అఘోరా పూజలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నారు. దేవుడు మనవైపు ఉన్నాడు..వర్షాలు కురిపించాడు” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్‌జి, సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కల్యాణి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.