భారత ఆటో మొబైల్ మార్కెట్లో అనేక వాహనాలు అమ్ముడవుతుంటాయి. ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే కస్టమర్లకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది రెండు ప్రముఖ స్కూటర్లైన హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 లలో దేనిని కొనాలో ఆందోళనలో ఉంటారు. ప్రస్తుతం ఈ రెండూ వాహనాలు ఇండియాలో 125cc స్కూటర్ విభాగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూటర్ల ధర, ఫీచర్లు, పనితీరు, మైలేజ్‌ పరంగా ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.


హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: ధర

చాలా నగరాల్లో టీవీఎస్ జూపిటర్ 125 కంటే హోండా యాక్టివా 125 ధర ఎక్కువగా ఉంది. వివిధ వేరియంట్‌ల కోసం యాక్టివా 125 ధర రూ.91,128 నుండి ప్రారంభమవుతుంది. అయితే జూపిటర్ 125 ధర వేరియంట్ నగరాన్ని బట్టి రూ.75,000 నుండి రూ.87,000 వరకు ఉంటుంది.

హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: ఇంజిన్, పనితీరు

యాక్టివా 125లో 123.92cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది సుమారుగా 8.31 హార్స్‌పవర్, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక జూపిటర్ 125లో 124.8cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 8.44 హార్స్‌పవర్, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు స్కూటర్లూ CVT ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తాయి.

హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: మైలేజీ, పనితీరు

యాక్టివా 125cc ఇంజన్ లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టెస్ట్ డ్రైవ్ టైమ్ లో టీవీఎస్ జూపిటర్ 125 ప్రకటించిన మైలేజ్ లీటరుకు సుమారు 57 కిలోమీటర్లుగా ఉంది. అయితే నడిపే శైలి, లోడ్‌ను బట్టి మైలేజీ మారుతూ ఉంటుంది.

హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: ఫీచర్లు

హోండా యాక్టివా 125లో ఎల్ఈడీ లైటింగ్, ఉన్నత శ్రేణి మోడళ్లలో కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంధన సామర్థ్యం కోసం హోండా అడ్వాన్స్‌డ్ ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు..టీవీఎస్ జూపిటర్ 125 స్మార్ట్‌కనెక్ట్‌తో సహా అనేక వేరియంట్లలో లభిస్తుంది. ఇది కనెక్టివిటీ ఫీచర్లు, యూఎస్‌బి ఛార్జింగ్, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది తన సెగ్మెంట్‌లోనే అతిపెద్దదైన 33 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది.