బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశారు. 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. వయసు పైబడటం, రాజకీయాలు అవినీతిమయం కావడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సంక్షేమం కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోసారి ఎన్నికల్లో పోటీచేయాలని మైసూరులోని వరుణ నియోజకవర్గం ప్రజలు తనను కోరారని, అయితే ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని సిద్ధరామయ్య తెలిపారు.

గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు సమకూర్చేవారని, విజయాన్ని చేకూర్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 79 ఏళ్లని, తమ (కాంగ్రెస్) ప్రభుత్వం పదవీకాలం మరో ఏడాదిన్నర మిగిలి ఉందని చెప్పారు. అప్పటికి తన వయస్సు 81-82 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మునుపటిలా అదే ఉత్సాహంతో పనిచేయడం సాధ్యం కాదని వెల్లడించారు. 2028 నాటికి తన రాజకీయ ప్రస్థానం 50 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ కెరీర్ ప్రారంభమైందని, విజయాలు, పరాజయాలు కూడా తాను చవిచూశానని చెప్పారు.