
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు కొనసాగిస్తుండటంతో కేంద్ర హోం శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. జంతర్‌మంతర్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను గురవారం అర్ధరాత్రి వరకూ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ నివారణ దృష్ట్యా టెలికమ్యూనికేషన్ చట్టం-2023, టెలికమ్యూనికేషన్స్ (తాత్కాలికంగా సేవలు నిలిపివేత) నిబంధనలు-2024 కింద ఈ చర్యలు తీసుకున్నట్టు ఎంహెచ్‌ఏ తెలిపింది. జూలై 17 నుంచి జంతర్ మంతర్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేస్తూ హోం శాఖ ఆదేశాలివ్వడం ఇది ఐదోసారి. పోటీ పరీక్షల్లో అవకతవకలపై జవాబుదారీతనం. విద్యావ్యవస్థలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ సారథ్యంలో జూన్ 20 నుంచి విద్యార్థులు ఆందోళనలు సాగిస్తున్నారు.











