
ఆహార, ఔషధ నియంత్ర శాఖలు విలీనం
ప్రభుత్వం ఉత్తర్వులు
టిజి సేఫ్ పేరిట కొత్త ఏకీకృత అథారిటీ ఏర్పాటు
నూతన కమిషనర్‌గా అవినాష్ మహంతి నియామకం
నియంత్రణ వ్యవస్థల ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆహా ర, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా ప నిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఔషధ ని యంత్రణ (డ్రగ్స్ కంట్రోల్) విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థకు తెలంగాణ స్టాండర్డ్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టిజి సేఫ్) అని నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకారదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన విధానం 2026 ఆగ స్టు 15నుంచి అమలులోకి వస్తున్నట్లు ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అవినాష్ మొహంతిని టిజి సేఫ్ నూతన క మిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) మరో జిఒ విడుదల చేశారు. ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్- 2026, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్2011 ప్రకారం టిజి సేఫ్ కమిషనర్ అధికారాలు, విధులు నిర్వహించనున్నారు. ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై మరింత సమన్వయంతో చర్యలు తీసుకునే దిశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఆహార కల్తీలకు అడ్డుకట్ట
రాష్ట్రంలో ఆహార వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత లేని, నకిలీ ఆహార పదార్థాలు, ఔషధాలను నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం -1940 కింద నిబంధనల అమలు, పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ విలీనం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ రెండు విభాగాల లక్ష్యాలు ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రత, నాణ్యతా ప్రమాణాల హామీ వంటి ఉమ్మడి అంశాలతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. ఈ కొత్త ఏకీకృత వ్యవస్థ కింద డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, లేబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేస్తాయి.
అయితే, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ చట్టాల ప్రకారం సంబంధిత అధికారుల చట్టబద్ధమైన అధికారాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఏకీకృత విధానం ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు, ప్రస్తుతం ఉన్న యంత్రాంగాలను సమీక్షించేందుకు ఒక రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవస్థాగత ఆధునికీకరణ, సర్వీస్ రూల్స్ సమన్వయం, క్షేత్రస్థాయి యూనిట్లు, ప్రయోగశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి, జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఒక పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించేందుకు సూచనలు చేస్తుంది.
తొలుత క్యూర్ పరిధిలో అమలు
ఆహార, ఔషధ వ్యాపార సంస్థలు అధికంగా ఉండే క్యూర్ ప్రాంతంలో ప్రాధాన్యతా క్రమంలో ఈ విధానాన్ని ముందుగా అందుబాటులోకి తీసుకొస్తారు. తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం రాష్ట్ర డిజిపి తగినంత మంది పోలీసు సిబ్బందిని టీజీ సేఫ్‌కు డిప్యుటేషన్‌పై కేటాయించనున్నారు. అలాగే, ఈ వ్యవస్థను ఆధునీకరించేందుకు, అవసరమైన సిబ్బంది నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ఒక రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది.
టిజి సేఫ్ కింద మొత్తం 6 కీలక విభాగాలను ఏర్పాటు చేశారు
డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం: ఔషధాల లైసెన్సింగ్, తనిఖీలు, నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తుంది.
ఫుడ్ సేఫ్టీ విభాగం: ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు, తనిఖీలను పర్యవేక్షిస్తుంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం: నిఘా పెంచేందుకు, దాడులు నిర్వహించేందుకు ఇందులో తాత్కాలికంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తారు.
లీగల్ అండ్ ప్రాసిక్యూషన్ విభాగం: చట్టపరమైన సలహాలు, కోర్టు కేసుల నిర్వహణను చూసుకుంటుంది.
ల్యాబొరేటరీ విభాగం: ఆహార, ఔషధ నాణ్యతా పరీక్షా కేంద్రాలు (ల్యాబ్‌లు) ఒకే గొడుగు కిందకు వస్తాయి.
అడ్మినిస్ట్రేటివ్ వింగ్: సిబ్బంది నియామకాలు, బడ్జెట్, పరిపాలనాంశాలను పర్యవేక్షిస్తుంది.











