న్యాయస్థానాల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా షేర్ చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు, లేదా సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికల్లో షేర్ చేయడం, మానిటైజేషన్‌కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది. కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారంనాడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్,

జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనన్‌ల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్న కోర్టు వీడియోల కారణంగా న్యాయస్థానాల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానంలో ఒక న్యాయవాది తన చేతిలోని కాగితాలను గాల్లోకి విసరిన వీడియోలు వైరల్‌గా మారాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఒక జోక్‌గా మారిందని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారంపై ఆంక్షలు విధించాలని కోరారు. దీంతో న్యాయస్థానం స్పందిస్తూ కోర్టులు 24 గంటలు నడిచే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావని, కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్‌లపై కూడా పరిమితులు ఉండాలని అభిప్రాయపడింది. మెటా, ఎక్స్, ఇతర సోషల్ మీడియా వేదికలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.


పిటిషనే దాఖలు కాలేదు.. విచారణ ఎలా..? :

సిజెపి పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ వెలువడిన వార్తలను సిజెఐ ఖండించారు. అలాంటి కథనాలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారని మీడియాపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను సామాజిక మాధ్యమాలలో అనధికారికంగా పోస్ట్ చేయడం, షేర్ చేయడంపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఆందోళనలకు సంబంధించి ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదన్నారు. కేవలం మౌఖిక అభ్యర్థనను పిటిషన్‌గా ఎలా పరిగణిస్తాం?. పిటిషన్ దాఖలైందంటూ గత రెండు రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.