
సిఐడి విచారణకైనా సై..
ఆరోపణలు రుజువు చేయాలి.. లేదా క్షమాపణ చెప్పాలి
సిఎం రేవంత్ కు కెటిఆర్ సవాల్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవు అని స్పష్టం చేశారు. గ్లోబరీనా తన బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్‌ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధికోసమే తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.











