
యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిని వదిలిపెట్టం
లీక్‌లకు పాల్పడినవారికి వేగంగా కఠిన శిక్షలు పడేలా విచారణ జరిపిస్తాం
యువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది మరొకటి లేదు
ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ: దేశ యువత సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నీట్ పరీక్షలో అవకతవకలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నిర్వహించిన సంసద్ చలో మార్చ్ అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ నిరసనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఆందోళనను అడ్డుకునే క్రమంలో 100 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. అదే మా ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యం. యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం అని ఆయన పేర్కొన్నారు.
పేపర్ లీకేజీల అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది కీలకమైన అడుగని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రధాని మొదటిసారి మంగళవారం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పందించారు. ఈ సమావేశానికి ప్రత్యక్ష ప్రసారం లేకపోయినా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పలువురు ఎంపీలు ప్రధాని వ్యాఖ్యలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘోర పాపం అని అభివర్ణించిన మోదీ, యువత భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమస్య రాజకీయాలకు అతీతమై, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం అని పేర్కొంటూ, కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత విశ్వాసాన్ని గెలుచుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలతో ఆప్యాయంగా మమేకం కావాలని కూడా ఎన్‌డీఏ ఎంపీలకు సూచించారు.
పేపర్ లీక్ సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి 13 మందిని అరెస్టు చేసినట్లు ప్రధాని సమావేశంలో గుర్తు చేశారని కిరణ్ రిజిజు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు నీట్ రీ-ఎగ్జామ్‌ను ఆలస్యం లేకుండా నిర్వహించి, ఫలితాలను కూడా త్వరగా ప్రకటించామని చెప్పారు. అలాగే, రీ-ఎగ్జామ్ వల్ల విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగినా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రముఖ న్యాయవాదులను కూడా ప్రభుత్వం నియమించిందని ప్రధాని వివరించినట్లు ఎంపీలు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, వారిని తప్పుదోవ పట్టించడం సులభమే కానీ సరైన మార్గంలో నడిపించడం కష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఆందోళన కొనసాగిస్తున్న సీజేపీ
జూన్ నుంచి పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న సీజేపీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతోంది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తొలుత పోలీసులు ఆయనను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా, అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో గురుగ్రామ్‌లోని మెడాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వెళ్లి వాంగ్‌చుక్‌ను పరామర్శించారు. నడ్డా గాయపడిన ఆందోళనకారులను కూడా పరామర్శించడంతో పాటు, సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రతిపక్ష ఆందోళనల కారణంగా వర్షాకాల సమావేశాల తొలి మూడు రోజులు ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదే సమయంలో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పేపర్ లీకేజీ ఘటనలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయలేమని పేర్కొన్నాయి.











