
సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి
తాగు నీటి సరఫరాపై ఎల్ నినో ప్రభావం పడకుండా చూడాలి
నీటి వనరులను అనుసంధానం చేయాలి
నిర్దేశిత సమయంలో ఎస్‌టిపిల నిర్మాణం పూర్తి చేయాలి
వాటర్ బోర్డు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి, ఎంఎంసి, సిఎంసిలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సిఎం సూచించారు. హైదరాబాద్ మహా నగర తాగు నీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసిహెచ్‌ఆర్‌డిలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలని సిఎం సూచించారు.
ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సిఎం తేల్చిచెప్పారు.
ఎస్‌టిపిల నిర్మాణ పనులపై సిఎం ఆరా తీశారు. ఎస్‌టిపిల నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. తాగు నీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్‌టిపిల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సిఎం సూచించారు. సమీక్షలో ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి ఎండి అశోక్ రెడ్డి, జెఎండి మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.











