బాలికపై లైంగిక దాడి కేసులో కలకలం

ఇద్దరి అరెస్ట్.. మరో ‘పెద్ద’ పేరు చుట్టూ చర్చ 8బాలిక వాంగ్మూలం లోనే ముగ్గురు పేర్లు వెల్లడైనట్లు ప్రచారం 8కీలకం కానున్న ఫోన్ డేటాపై ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రమేయంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ 8పలుకుబడితో తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు 8సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి అజ్ఞాతంలోనే

మన తెలంగాణ/అమీన్పూర్/రామచంద్రాపురం: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు రామచంద్రాపురంలో సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించడంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. అయితే.. బాలిక వాంగ్మూలంలో మరికొందరి పేర్లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఫోన్ డేటాలో కీలక ఆధారాలు వెలుగుచూశాయన్న సమాచారంతో అసలు ‘మూడో వ్యక్తి’ ఎవరన్న ప్రశ్న రామచంద్రపురం పట్టణంలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు వెలిగి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కీలకంగా ఉన్న ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేస్తు రాజకీయంగా పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపిస్తుండటంతో స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

తొలుత సాయిలు.. నిన్న బిల్లే రవి..మరి రేపు..?

సైబరాబాద్ రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో సుమారు 15 రోజుల క్రితం మైనర్ బాలికపై ఓ ఆలయంలో లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సాయిలు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తును విస్తరించిన క్రమంలో గత ఏడాది జరిగిన మరో ఘటనలో అతడితో కలిసి బిల్లే రవి కూడా బాలికను యాదగిరిగుట్టకు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

బాలికకు డబ్బులు, ఇతర వస్తువుల ఆశ చూపి అక్కడికి తీసుకెళ్లి బట్టలు, ఇతర వస్తువులు కొనిపెట్టిన అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో బిల్లే రవిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించగా మూడో వ్యక్తి పేరుపై ప్రస్తావనపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.

‘మరో పేరు’ ఎవరిది..?

ఇద్దరి అరెస్టులతో కేసులో దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో.. మరో వ్యక్తి పేరు చుట్టూ చర్చ మొదలైంది. బాధితురాలి వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పోలీసులు బిల్లే రవిని గుర్తించి అరెస్టు చేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే మిగిలిన వ్యక్తి విషయంలో మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడించక పోవడంపై అనేక అనుమానాలకు ప్రవహిస్తోంది. దీంతో ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆయన పాత్ర ఏమిటి? అసలు ఈ కేసులో ఆయనకు సంబంధం ఉందా? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. కాగా అధికారికంగా పోలీస్ వెల్లడించినప్పటికీ స్థానికంగా మాత్రం సదరు వ్యక్తి ఎవరనే అంశం పై బహిరంగంగా చర్చించుకోవడం విశేషం.

రాజకీయ పలుకుబడి ఉన్న ‘పెద్ద’ మనిషి?

స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు మరింత సంచలనంగా మారుతున్నాయి. రామచంద్రాపురం పట్టణంలో గతంలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి పేరు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తికి రాజకీయ పలుకుబడితో పాటు ఆర్థికంగా కూడా బలమైన నేపథ్యం ఉందని, అందువల్లే ఆయన పేరు దర్యాప్తులో వినిపించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు సైతం స్థానికులు చేస్తున్నారు.

ఫోన్ డేటా ఏం చెబుతోంది?

ఈ కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. బాలిక ఫోన్ నంబర్‌కు సంబంధించిన కాల్ డేటా, పరిచయాలు, సంభాషణలు, సీసీటీవీ ఫుటేజు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాయిలు, బిల్లే రవితో పాటు ఇతర వ్యక్తులతో బాలికకు ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బాలికను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. ఫోన్ డేటా, వాంగ్మూలం, ఇతర ఆధారాలను సమన్వయం చేస్తే కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒత్తిళ్లకు తలొగ్గుతారా?

కేసులో కీలకంగా భావిస్తున్న మరో వ్యక్తిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తుపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక ఆధారాలు లభించకపోవడం వల్లే చర్యలు తీసుకోలేదా? అన్నది పోలీసుల తదుపరి దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.

మూడో అరెస్ట్‌కు రంగం సిద్ధమా?

ఇప్పటికే ఇద్దరు నిందితుల అరెస్టుతో కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. మరో వ్యక్తి ప్రమేయంపై కూడా ఆధారాలు లభిస్తే అరెస్టు తప్పదన్న చర్చ సాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలు, ఇతర దర్యాప్తు వివరాల ఆధారంగా పోలీసులు తదుపరి అడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇద్దరి అరెస్టుతో కథ ముగిసిందా?.. లేక అసలు కీలక పాత్రధారి ముసుగు తొలగించి కేసును పారదర్శకంగా ముగిస్తారా..? మరేదైనా జరుగుతుందా..? అని రామచంద్రాపురంలో ఇప్పుడు అందరి దృష్టి పోలీసుల తదుపరి చర్యలపైనే ఉంది.