విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

ఒయు, జెఎన్‌టియు పరీక్షలు వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) పాఠశాలలు, కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్‌ఎన్‌యుఐ, ఎస్‌ఎఫ్‌ఐ,ఎఐఎస్‌ఎఫ్,పిడిఎస్‌యు, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యు సంఘాల నాయకులు కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు యాడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రజాస్వామ్యవాదులు బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ప్రజాస్వామ్య నిరసనలకు లాఠీలు కాదు, సంభాషణే సమాధానమని పేర్కొన్నారు.

సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు

విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ప్రైవేట్ యాజమాన్యాలు సెలవుకు సంబంధించిన సమాచారాన్ని ఆయా స్కూల్, క్లాసుల వారీగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేశారు. బంద్ కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు శుక్రవారం మూతపడే అవకాశం ఉంది.