
ఆగని విపక్షాల నిరసనలు.. కదలని ఉభయసభలు
ముందస్తు షరతులు లేకుండా చర్చకు సిద్ధమేనన్న కిరణ్ రిజిజు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చకు సిద్ధమన్న ఖర్గే
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అమిత్‌షా
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ల మధ్య పార్లమెంటు ఉభయసభలు నాలుగోరోజైన గురువారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలకు నోచుకోలేదు. తొలుత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వరుసగా సభ రెండు సార్లు వాయిదా పడి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. సభ్యులు నిబంధనలను పాటించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలను తప్పుపడుతూ, ముందస్తు షరతులతో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మాన్ ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఆయన సమాధానమిచ్చారు. విపక్ష సభ్యులు కోరినంత సమయం తీసుకోవచ్చని, రెండు రోజుల పాటు చర్చించవచ్చని అన్నారు. ఉభయసభల్లో చర్చించే తేదీ, సమయాన్ని విపక్షాలు నిర్ణయించుకోవచ్చని చెప్పారు. చర్చపై కాంగ్రెస్, ఇతర విపక్షాలను ప్రభుత్వం సంప్రదిస్తోందన్నారు. విపక్షాలు పట్టువీడకపోవడంతో సభను శుక్రవారంనాటికి సభాపతి వాయిదా వేశారు.
అటు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభంకాగానే విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకైనా విపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న హరివంశ్ స్పందిస్తూ, చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున ప్రతిష్టంభన తొలగేందుకు విపక్ష నేత చర్చను ప్రారంభించాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ నిరసనలు తెలిపేందుకే విపక్షాలు మొగ్గుచూపుతున్నాయని విమర్శించారు. ఈరోజు నుంచే చర్చకు తాము సిద్ధంగా ఉన్నందున విపక్షాలు ఎలాంటి షరతులు లేకుండా ముందుకు రావాలన్నారు. ఇందుకు ఖర్గే నిరాకరిస్తూ, చర్చ ప్రారంభం కావడానికి ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. దీంతో అధికార, విపక్ష సభ్యులు వాదనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలు శుక్రవారంనాటికి వాయిదా పడ్డాయి.
ఓం బిర్లాను కలిసిన అమిత్‌షా
నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాల నిరసనలతో సభా కార్యక్రమాలు ముందుకు సాగకపోవడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారంనాడు కలుసుకున్నారు. ఎలాంటి సభా కార్యక్రమాలు జరక్కుండా లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడిన వెంటనే అమిత్‌షా స్పీకర్‌ను కలిసారు. దీనికి ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సైతం స్పీకర్‌ను కలిసారు. టీఎంసీ నేతలు సౌగత రాయ్, మహువా మొయిత్ర సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓం బిర్లా విపక్ష సభ్యులు తనను కలవాలని, చర్చ ఎప్పుడు ప్రారంభించేది, ఎంత సేపు జరగాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత సోమవారంనాడు ప్రారంభమైనప్పటికీ పేపర్ లీక్, అయోధ్య రామాలయం విరాళాల చోరీ ఆరోపణలపై విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి.











