మనతెలంగాణ/హైదరాబాద్ : ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం మాటలకే పరిమితం అయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షలు తీసుకుని సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెబుతోందని చెప్పారు. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తేల్చిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లుగా పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే సిఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 30 నెలలు అయినా హైదరాబాద్ నగరంలో ఒక్క ఇళ్లు నిర్మించలేదు..కానీ, సిఎం మాత్రం ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ళు కడతామని మంత్రులు హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ హోర్డింగ్‌లు, ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కె.పి.వివేకానంద, మాధవరం కృష్ణా రావు,ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సిలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బిఆర్‌ఎస్ హయాంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించామని తెలిపారు. అత్యంత విలువైన ప్రాంతాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చామని చెప్పారు. సెక్రటేరియట్ చుట్టు పక్కల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 7 నుంచి 8 వేల ఇళ్ళు కట్టాలని భావిస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5 లక్షలు ప్రభుత్వం ఇస్తే 6 లక్షలు లబ్ధిదారులు ఇవ్వాలని ప్రభుత్వం అంటోందని విమర్శించారు. పేదరికంతో ఆర్థిక ఇబ్బందుల్లో వారి నుంచి రూ.6 లక్షలు తీసుకుని ఇళ్లు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం బోగస్ మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పది వేలు కడితే ఉచిత ఇళ్ళు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు కూడా పది వేలు చెల్లించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు చేసుసుకోవాలని నిబంధన విధించారని అన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. 39 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో లాటరీ పద్ధతుల్లో పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామని తెలిపారు.