
సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథోత్సవం కొనసాగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారంనాడు జగన్నాథ ‘బహుడా’ యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథాలను లాగుతూ లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలు మిన్నంటాయి. ఉదయం గుండిచా మందిరంలో స్వామికి సేవలు చేసిన అనంతరం బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామికి పోహండి
వేడుకను నిర్వహించారు. అనంతరం బహుడా యాత్ర ప్రారంభమైంది. గుండిచాం మందరంలో వారం రోజుల పాటు బస చేసిన అనంతరం మూడు రథాల్లో తిరుగు ప్రయాణం సాగించడాన్ని బహుడా యాత్రగా పేర్కొంటారు. తొలుత బలభద్ర రథం ‘తాళధ్వజ్’ ముందుకు కదలగా, ఆ వెనుకే సుభద్ర రథం ‘దర్పదళన్’, జగన్నాథ స్వామి రథం ’నందిఘోష్’ ముందుకు కదిలాయి. కళాకారుల సాంస్కృతిక నృత్యాలతో సంబరాలు అంబరమంటాయి.











