
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ఆయన స్వచ్ఛందంగా పద వి నుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభు త్వం ఆయనను తొలగించాలని డిమాండ్ చేసిం ది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు శనివారం మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరినట్లు వెల్లడించింది. అప్పటివరకు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతాయని తెలిపింది.ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు,సీజేపీ నేతల మధ్య రెండో విడత చర్చలు జరిగాయి.
కేం ద్రం తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ న డ్డా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రంకా హాజరయ్యారు. “ధర్మేంద్ర ప్ర ధాన్ రాజీనామా డిమాండ్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వర కు సమయం కోరింది. ఆయనను త్వరలోనే పద వి నుంచి తొలగిస్తారని ఆశిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం, విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది” అని అశుతోష్ రాంకా తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై న్యాయపరమైన చర్యలు తీసుకోకూడదని, పరీక్షల్లో అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని సీజేపీ షరతులు విధించింది. ఈ రెండింటికీ ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. దీంతో కేంద్రంతో చర్చలకు సీజేపీ అంగీకరించింది. చర్చలు దాదాపు రెండు గంటలపాటు సాగాయని జేపీ నడ్డా తెలిపారు. “వారు మూడు ప్రధాన డిమాండ్లతోపాటు పరీక్షల నిర్వహణలో ఐదు సంస్కరణలను సూచించారు. ప్రభుత్వంలో వీటి పై చర్చించి శనివారం మధ్యాహ్నం మరోసారి వా రితో సమావేశమై నిర్ణయాన్ని తెలియజేస్తాం” అని చెప్పారు. ప్రభుత్వం నుంచి కీలకమైన హామీలు లభించడంతో ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చు క్ 26 రోజుల నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి విరమించిన కొన్ని గంటల తర్వాత ఈ స మావేశం జరిగింది. తొలుత ప్రభుత్వం మౌఖికం గా హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని లిఖితపూర్వకంగా ఇవ్వాలని తాను పట్టుబట్టడంతో దీక్ష విరమణ రెండు రోజులు ఆలస్యమైందని 59 ఏళ్ల వాంగ్‌చుక్ వెల్లడించారు. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మరే పరిష్కారాన్నీ అంగీకరించబోమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. “విద్యార్థుల ఆందోళనకు పరిష్కారం కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే మార్గం” అని 30 ఏళ్ల దీప్కే పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య గత విడత చర్చలు జులై 20న జరిగాయి. సీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాం కా.. జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. ఆ సమావేశం సందర్భంగా తమను దాదాపు నిర్బంధించినట్లుగా ఉంచారని వారు ఆరోపించారు. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వంతో జరిగే చర్చలను తటస్థ వేదికపైనే నిర్వహించాలని పట్టుబట్టారు. ఇదిలా ఉండగా, గురువారం అర్ధరాత్రి ఎక్స్‌లో విడుదల చేసిన స్వీయ వీడియోలో ప్రధా ని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించడంతో పాటు కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం పరిశీలించనున్నట్లు తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖలోనూ కీలక మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు బదిలీ చేసింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య విభాగాల్లోని కీలక పదవుల్లో కొత్త అధికారులను నియమించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంటోంది.











