గ్లోబరీనా సంస్థ విషయంలో నిజాయితీని నిరూపించుకోవాల్సింది కెటిఆరే

బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఇంటర్ మూల్యాంకనం తప్పిదాలకు 27 మంది విద్యార్థులు బలి

ఇందుకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలి

చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నిలదీసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కెటిఆర్‌కు ధర్నాచౌకే దిక్కయిందని వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కెటిఆర్‌కు లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని బిఆర్‌ఎస్ ఖండించలేదని, బిజెపిని ప్రశ్నించే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో కెటిఆర్ మహాధర్నా చేపట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, కానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోమెట్ సంస్థ తెలంగాణలోనే పుట్టిందని, ఆ సంస్థతో కెటిఆర్‌కు సంబంధాలున్నా యని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు.

ఆ సంస్థ నిర్మించిన ఫాంహౌస్‌లోనే కెటిఆర్ ఉంటున్నారని, సంస్థకు సంబంధించిన భూములు కూడా ఆయన వద్దే ఉన్నాయని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. అలాగే, 2019లో ఇంటర్ పరీక్షల నిర్వహణకు గ్లోబరీనా సంస్థకు అక్రమంగా టెండర్లు కేటాయించారని, ఆ సంస్థపై జేఎన్‌టియూ హైదరాబాద్, జేఎన్‌టియూ కాకినాడలో కేసులు నమోదైనా చర్యలు తీసుకోలేదన్నారు. 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, దీనిపై కెటిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. కోమెట్ కొత్త పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి సీబిఎస్‌ఈతో కూడా వ్యవహారాన్ని నడిపిస్తున్నారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థుల కోసం పోరాడుతున్నట్లు కెటిఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కూడా కెటిఆర్ ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ పాలనలో పేపర్ లీకేజీలు ఎక్కువగా జరిగాయని ఆయన విమర్శించారు.

పదిరోజుల ముందే దుబాయ్

కెటిఆర్ తన పుట్టిన రోజు కోసం పదిరోజుల ముందే దుబాయ్ వెళ్లారని, అక్కడ సినీ పరిశ్రమకు చెందిన కొందరితో కలిసి బర్త్‌డే పార్టీ జరుపుకున్నారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు పూర్తిగా రెస్ట్ మోడ్‌లో ఉన్నారని, ఆ తర్వాత ఒక్కసారిగా విద్యార్థుల ధర్నా పేరుతో డ్రామా ప్రారంభించారని బల్మూరి వెంకట్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు.