
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విమర్శలు రావడం సహజం. కానీ విమర్శను దేశద్రోహంగా, నిరసనను శాంతిభద్రతల సమస్యగా, ప్రశ్నించే వారిని శత్రువులుగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్యాన్ని బల పరచదు, పైగా బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గడం కూడా ఇలాంటి వైఖరి వల్లే ప్రారంభమవుతుంది. యువత ఎందుకు ఆందోళన చెందుతోంది అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందా? ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉందా? పరీక్షల పారదర్శకతపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందా? పాలనా వ్యవస్థలో ప్రతిభకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం భావోద్వేగ రాజకీయాలతో సమస్యలు పరిష్కారం కావు.
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలు ఎంత ముఖ్యమో, ప్రజల అసంతృప్తి అంతకంటే ముఖ్యమైన రాజకీయ సంకేతం. ముఖ్యంగా యువత వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తే దానిని కేవలం ఒక నిరసన కార్యక్రమంగా చూడలేం. అది సమాజంలో పేరుకుపోతున్న అసంతృప్తి, నిరాశ, భవిష్యత్తుపై ఆందోళనకు ప్రతిబింబం. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల నిజమైన బలం పోలీసు బలగాల్లో కాదు, ప్రజల మాట వినే రాజకీయ పరిపక్వతలో ఉంటుంది. ఇటీవలి కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగడం ఒక సాధారణ సంఘటన కాదు. ఉపాధి అవకాశాల కొరత, పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్యా వ్యవస్థలో అసమానతలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక అసురక్షిత భావన ఇవన్నీ కలిసి యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి.
ఈ సమస్యలను రాజకీయ నినాదాలతో లేదా ప్రచార కార్యక్రమాలతో దాచిపెట్టడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విమర్శలు రావడం సహజం. కానీ విమర్శను దేశద్రోహంగా, నిరసనను శాంతిభద్రతల సమస్యగా, ప్రశ్నించే వారిని శత్రువులుగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్యాన్ని బలపరచదు, పైగా బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గడం కూడా ఇలాంటి వైఖరి వల్లే ప్రారంభమవుతుంది. యువత ఎందుకు ఆందోళన చెందుతోంది అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందా? ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉందా? పరీక్షల పారదర్శకతపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందా? పాలనా వ్యవస్థలో ప్రతిభకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం భావోద్వేగ రాజకీయాలతో సమస్యలు పరిష్కారం కావు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత విలువైన హక్కుల్లో ఒకటి శాంతియుత నిరసన. రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కును గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. నిరసనలను అణచివేయడానికి అధిక బలప్రయోగం, సామూహిక అరెస్టులు, భయపెట్టే చర్యలు వంటి పద్ధతులు తాత్కాలికంగా ఉద్యమాలను తగ్గించినా, ప్రజల మనసుల్లోని అసంతృప్తిని మాత్రం మరింత పెంచుతాయి. చరిత్ర చెబుతున్న పాఠం కూడా ఇదే. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారికి మాత్రమే కాదు, ప్రతిపక్షానికీ బాధ్యత ఉంది. ప్రజల సమస్యలను రాజకీయ లాభనష్టాల కోణంలో కాకుండా జాతీయ ప్రయోజనాల కోణంలో చూడాలి. ఉద్యమాలను కేవలం ఓట్లుగా మార్చుకోవాలనే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రత్యామ్నాయ విధానాలు, స్పష్టమైన కార్యాచరణ, విశ్వసనీయ నాయకత్వం అవసరం.
ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితాలు, ఎన్నికల సంస్థల స్వతంత్రత వంటి అంశాలపై కూడా అనేక వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా అనేది వేరే విషయం. కానీ ప్రజల్లో అలాంటి సందేహాలు ఏర్పడటమే ప్రజాస్వామ్యానికి హెచ్చరిక. ఎన్నికల వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం కొనసాగడం ప్రతి ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. అందుకే ఎన్నికల నిర్వహణలో అత్యున్నత స్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్రత తప్పనిసరి. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు యువతను కేవలం ఓటర్లుగా చూడకూడదు. వారు ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తి, విజ్ఞానానికి మూలం, సామాజిక మార్పుకు ప్రధాన బలం. అలాంటి యువత నిరాశకు గురైతే దాని ప్రభావం కేవలం రాజకీయాలపైనే కాదు; ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, జాతీయ పురోగతిపై కూడా పడుతుంది. సోషల్ మీడియా యుగంలో సమాచారాన్ని పూర్తిగా నియంత్రించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ఒక సంఘటన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది.
అందువల్ల ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం, వాస్తవాలను పారదర్శకంగా వెల్లడించడం, విశ్వాసాన్ని పెంపొందించడం మాత్రమే సమర్థవంతమైన పాలనా విధానం. ప్రచారం నిజాలను శాశ్వతంగా భర్తీ చేయలేదు. ఒక బలమైన ప్రభుత్వం అంటే విమర్శలను అణచివేసేది కాదు; విమర్శలను వినగలిగేది. ప్రజలతో సంభాషణ కొనసాగించగలిగేది. పొరపాట్లను అంగీకరించి సరిదిద్దగలిగేది. అదే నిజమైన ప్రజాస్వామ్య పరిపక్వతకు గుర్తు. దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే సరిపోవు. ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం, న్యాయవ్యవస్థపై నమ్మకం, స్వేచ్ఛాయుత మీడియా, బాధ్యతాయుత పాలన, యువతలో ఆశావాదం -ఇవే అసలు అభివృద్ధికి పునాదులు. ఈ పునాదులు బలహీనపడితే ఆర్థిక ప్రగతి కూడా నిలకడగా ఉండదు. చివరికి ఏ ప్రభుత్వానికైనా గొప్ప విజయం ఎన్నికల్లో గెలవడం కాదు; ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. యువత వీధుల్లోకి రావడం అంటే కేవలం ఒక ఉద్యమం ప్రారంభమైందని కాదు, పాలనతో సమాజం మధ్య సంభాషణలో ఎక్కడో విరామం ఏర్పడిందని అర్థం. ఆ విరామాన్ని బలప్రయోగంతో కాదు, సంభాషణతో, సంస్కరణలతో,జవాబుదారీతనంతో పూడ్చా లి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చివరికి గెలవాల్సింది ప్రభుత్వం కాదు, ప్రజల విశ్వాసమే.
- కోలాహలం రామ్‌కిశోర్
9849328496











