
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో బాధ్యత వహించాల్సిన వారి జవాబుదారీతనం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విమర్శించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని మోదీ గురువారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోతో పాటు హాయ్... నా పేరు నథింగ్ అనే వ్యాఖ్యను పోస్టు చేశారు. మరోవైపు సీజేపీ అధికారిక ఖాతా నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పక రాజీనామా చేయాలి అంటూ పోస్టు చేసింది. సీజేపీ జాతీయ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ, ప్రధాని స్పందనను స్వాగతిస్తున్నామని, అయితే దాదాపు నెలన్నర రోజుల నిరసనల తర్వాత ఈ స్పందన రావడం విచారకరమన్నారు.
అంతేకాకుండా, ప్రశ్నపత్రాల లీకేజీలకు అసలు కారణం ఏమిటనే కీలక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. నెలన్నర రోజులుగా నిరసనలు కొనసాగుతున్న తర్వాత ప్రధాని స్పందించడం సంతోషకరం. బహుశా ఆయన విదేశీ పర్యటనలు ముగించుకుని దేశానికి తిరిగి వచ్చారు. కానీ పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అసలు ప్రశ్నపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని రాంకా అన్నారు.
గాయం అయిన తర్వాత మందు రాయడం ఒకటైతే, గాయం జరగకుండా ముందే నివారించడం అసలు లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్థను నడిపించే వారిలో జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏ మాత్రం సరిపోవని అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వైపు కూడా మళ్లుతోందని రాంకా పేర్కొన్నారు. నిరసనకారులు ప్రధానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము జంతర్‌మంతర్‌ను వీడేది లేదు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టుదలతో ఉద్యమిస్తున్నారు. అందరూ ఆయన రాజీనామానే కోరుతున్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఉద్యమం కేవలం ధర్మేంద్ర ప్రధాన్‌కే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది అని రాంకా ఆరోపించారు.











