
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (-73) మృతిచెందారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. నారాయణరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో 1953లో జన్మించిన జీ.వి. నారాయణరావు బాల్యం, చదువు గుంతకల్లు, హైదరాబాద్‌లలో సాగాయి. చిన్నతనం నుంచే కళలపై ఆసక్తితో గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్. కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే పలు నాటకాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి ప్రముఖులు ఆయనకు రంగస్థల మిత్రులుగా ఉండేవారు.
తొలి సినిమాకే నంది పురస్కారం..
1976లో లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ ‘అంతులేని కథ’ చిత్రంతో ఆయన నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ’తాళికట్టు శుభవేళ’ పాటతో పాటు ఆయన కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు.
రజనీకాంత్, చిరంజీవితో అనుబంధం
మద్రాస్ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 1973లో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో నారాయణరావు శిక్షణ పొందారు. అక్కడ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆయనకు బ్యాచ్‌మేట్ కావడంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ఒక ఊరి కథ, ముత్యాల పల్ల కి, అంగడి బొమ్మ చిత్రాల్లో హీరోగా నటించినా, ఆ తర్వాత సహాయ నటుడిగా రాణించారు.
100కు పైగా చిత్రాల్లో నటించి..
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 100కు పైగా చిత్రాలలో జీవీ నారాయణరావు నటించారు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతారామయ్య గారి మనవరాలు, చట్టానికి కళ్లులేవు, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, హిట్లర్, సాహసం, స్కైలాబ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. వెండితెరపైనే కాకుండా పలు ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన నటించిన చివరి చిత్రం ’ఆలోచన’ విడుదల కావాల్సి ఉంది. జీవీ నారాయణ రావు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లినీకూ శుభం నాకు వంటి చిత్రాలను నిర్మించారు.








