చైనా సహాయక బృందాలు హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన వీడియోలో నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం తీవ్రత స్పష్టంగా కనులకు కడుతోంది. గిరాంగ్ సరిహద్దు పోర్టు ప్రాంతంలో జరిగిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. విపత్తుకు ముందు, ఆ తర్వాతి దృశ్యాలను పోల్చి చూపించే 8 సెకన్ల వైమానిక దళం వీడియోలో నష్టం తీవ్రత స్పష్టమవుతోంది. విపత్తుకు ముందు తీసిన దృశ్యంలో గిరాంగ్ పోర్టు సదుపాయాలు పూర్తి స్థాయిలో కనిపించాయి. బహుళ అంతస్తుల భవనాలు, చైనా జాతీయ చిహ్నంతో ఉన్న ప్రధాన సరిహద్దు తనిఖీ భవనం, రహదారులు, లోయ గుండా ప్రవహిస్తున్న నది, చుట్టూ పచ్చని కొండలు, ఇతర మౌలిక సదుపాయాలు స్పష్టంగా కనిపించాయి.అయితే వరదల అనంతరం తీసిన దృశ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా కొట్టుకొచ్చిన మట్టి, రాళ్లు, శిథిలాలతో లోయ, కొండ ప్రాంతాలు బీడుగా మారాయి. చాలా వరకు భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి శిథిలాల కింద సమాధి కావడం కనిపించింది. మరోవైపు గిరాంగ్ టౌన్ షిప్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిని మూసివేశారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో చైనా ప్రధాని...

నేపాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చైనా ప్రధాని లీ కియాంగ్ సంబంధిత శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి పర్యటించారు. దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. భారత్-చైనా సరిహద్దును పర్యవేక్షించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు చెందిన ప్రత్యేక బృందాన్ని గురువారం ప్రభావిత ప్రాంతానికి పంపించారు. గిరాంగ్ కౌంటీలో సైనిక సిబ్బంది చేపడుతున్న సంయుక్త సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన విపత్తుపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. నేపాల్‌కు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జిజాంగ్ మిలిటరీ కమాండ్ ఇప్పటికే రెండు విడతల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించింది. విపత్తు తీవ్రతను అంచనా వేయడం, సహాయక విమానాల రాకపోకలకు మార్గాలను గుర్తించడం, గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు వైద్య, సహాయక సామగ్రిని ప్రభావిత ప్రాంతాలకు తరలించే పనులను హెలికాప్టర్లు నిర్వహిస్తున్నాయి.