జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో యువ ఓటర్ల కత్తు జెన్ జీ ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జరిగిన చలో సన్సద్ యువత పోరాట సత్తాను అద్దంపట్టాయి. వాళ్లపై ప్రయోగించిన అణచివేత ప్రభుత్వం కూసాలు కదిలేలా చేసింది. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలు జెన్ జీ గురించి ఆలోచించాల్సిన స్థితిని కల్పించింది. ఈ దశలో భారత ప్రజాస్వామ్యం కీలకమైన మలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఆ మార్పును నిర్దేశించే శక్తిగా క్రమంగా జెన్ జీ (Generation Z) తరం ఎదుగుతున్నది. 1995 మధ్యకాలం నుంచి 2010ల ప్రారంభం వరకు జన్మించిన యువతను జెన్ జీగా పరిగణిస్తారు. 2026 నాటికి వీరి వయస్సు సుమారు 14 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. దేశ రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను, ప్రజా విధానాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ఓటరు వర్గంగా ఇప్పుడు ఈ తరం రూపుదిద్దుకుంటోంది.

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 96.88 కోట్లు. వీరిలో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 22.78 శాతం, అంటే దాదాపు 22 కోట్ల మంది. ఇందులో 18-19 సంవత్సరాల మధ్య వయస్సుగల తొలి ఓటర్లు 1.85 కోట్లు, 20- 29 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 19.74 కోట్లకుపైగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు మాత్రమే రెండు కోట్లకు పైగా కొత్త యువ ఓటర్లు ఓటరు జాబితాల్లో చేరడం విశేషం. ఈ గణాంకాలు జెన్ జీ ఓటర్ల పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లలో జెన్ జీ వాటా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు జెన్ జీకి చెందినవారే అయ్యే పరిస్థితి ఏర్పడనుంది.

కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యువ ఓటర్ల ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ డయ్యూలో జెన్ జీ ఓటర్ల వాటా దాదాపు 39 శాతం కాగా, మేఘాలయలో అది 36 శాతం వరకు ఉంది. పెద్ద రాష్ట్రాలైన జార్ఖండ్, రాజస్థాన్, అసోం, బీహార్ల్లో యువ ఓటర్ల శాతం 25 నుంచి 29 శాతం మధ్య ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జాతీయ సగటుకు సమీపంగా 22- 24 శాతం ఉన్నప్పటికీ, సంఖ్యాపరంగా చూస్తే కోట్లాది యువ ఓటర్లు ఉన్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వృద్ధ జనాభా అధికంగా ఉండటంతో జెన్ జీ వాటా 18- 20 శాతం మధ్యే ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో యువ ఓటర్ల సంఖ్య ఉంది. సాంప్రదాయంగా యువత పోలింగ్లో పెద్దఎత్తున పాల్గొనదనే అభిప్రాయం ఉండేది. అయితే జంతర్‌మంతర్ వాళ్ల చైతన్యాన్ని ప్రస్ఫుటం చేసింది. దేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 67.4 కాగా, 2024లో అది 65.8 శాతానికి తగ్గింది. అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో యువ ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.

2014, 2019 ఎన్నికల్లో అభివృద్ధి, ఉపాధి, జాతీయత వంటి అంశాలపై భారతీయ జనతా పార్టీకి యువత నుంచి గణనీయమైన మద్దతు లభించింది. అయితే 2024 ఎన్నికల నాటికి ఉపాధి అవకాశాల కొరత, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలు యువత ఆలోచనలను ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. జెన్ జీ ఓటర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీకి శాశ్వత మద్దతుదారులు కాదు. తమ జీవితాలను ప్రభావితం చేసే వాస్తవ సమస్యల ఆధారంగానే వారు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. జెన్ జీ తరం ముందున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఉన్నత విద్య పూర్తిచేసినా, నైపుణ్యాలు సంపాదించినా నాణ్యమైన ఉద్యోగాలు దొరకక లక్షలాది మంది యువత నిరాశలో ఉన్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం యువ నిరుద్యోగిత 15 నుంచి 25 శాతం మధ్య నమోదవుతోంది. అందుకే ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారదర్శక నియామక వ్యవస్థలు ఈ తరానికి అత్యంత ప్రాధాన్య అంశాలుగా మారాయి. విద్యా వ్యవస్థ కూడా యువత ఆందోళనల్లో కీలక స్థానం సంపాదించింది.

నాణ్యమైన ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులు, నైపుణ్యాధారిత బోధనను వారు కోరుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మూల్యాంకనలో లోపాలు వంటి పరిణామాలు యువతలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. జెన్ జీలో అపారమైన రాజకీయ శక్తి ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తిస్థాయిలో ఓట్లుగా మారలేదు. ముఖ్యంగా తొలి ఓటర్లలో పోలింగ్ శాతం ఆశించిన స్థాయికి చేరడం లేదు. ఉపాధి, విద్య, అవకాశాల విషయంలో ప్రభుత్వాలు ఆశించిన ఫలితాలు చూపలేకపోతే యువతలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో జెన్ జీ ఓటర్ల పాత్ర మరింత నిర్ణయాత్మకంగా మారనుంది. ఉపాధి, విద్య, ఆర్థిక అవకాశాలు, జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణను చూపగల రాజకీయ పార్టీలకే యువత మద్దతు లభించే అవకాశం ఉంది.

యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసే పార్టీలకు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు. జెన్ జీ ఆశిస్తున్నది ఆధునిక భారతదేశాన్ని. నాణ్యమైన ఉద్యోగాలు, అందుబాటులో ఉన్నత విద్య, స్వచ్ఛమైన పర్యావరణం, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, సాంకేతిక పురోగతి-ఇవే వారి ప్రధాన ఆకాంక్షలు. సమాచార సాంకేతికతతో పెరిగిన ఈ తరం తెలుసుకుని, విశ్లేషించి, చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి, జెన్ జీ ఓటర్లు భారత ఎన్నికల్లో ఒక సాధారణ వర్గం కాదు; భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్దేశించే శక్తి. వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే సామర్థ్యం అపారంగా ఉంది. జీవితానికి నేరుగా సంబంధించిన సమస్యలపైనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించి యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలు రూపొందించే రాజకీయ పార్టీలకే రాబోయే కాలంలో ప్రజా మద్దతు లభించే అవకాశాలు ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు ఇది ఒక అపూర్వ అవకాశమే.

- పెండ్యాల కొండల్