సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్ తప్పనిసరి

విచారణ నిష్పాక్షికంగా జరిగేలా చర్యలు తీసుకోండి

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.ఈ కేసు విచారణ కోసం ఐజి కిరణ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.