
మన తెలంగాణ/హైదరాబాద్, హాలియా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబీ) నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఎపి అధికారులు సాగర్ కుడి కాలువ ద్వారా సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలోని తాగునీటి అవసరాల కోసమే నీటిని తీసుకుంటున్నామని ఎపి అధికారులు చెబుతుండగా, బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుడి కాలువకు నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని ప్రాజెక్ట్ నిర్వహణ పర్యవేక్షిస్తున్న ఎపి అధికారులను తెలంగాణ ఇరిగేషన్ అధికారు లు కోరారు. అయితే, తెలంగాణ అధికారుల అభ్యంతరాల ను ఎపి ఇంజనీరింగ్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు.
సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
దీంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎపి ఏకపక్షంగా నీటిని తోడేస్తున్నప్పుడు తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తూ, పోటాపోటీగా సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నింపడంతో పాటు తమ పరిధిలోని తాగునీటి అవసరాల నిమిత్తం ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బోర్డు అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలు కాలువలకు నీటిని విడుదల చేసుకునే పరిస్థితి తలెత్తడంపై ప్రాజెక్టు వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాజెక్టు నీటి మట్టాలు, నిల్వల లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా కెఆర్‌ఎంబీకి సమాచారం ఇవ్వకుండా నీటిని తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించిన వ్యవహారాన్ని కృష్ణా బోర్డు దృష్టికి అధికారికంగా తీసుకెళ్లేందుకు రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే 10 టిఎంసీ నీటిని వినియోగించుకున్న ఎపి ఇరిగేషన్
మే నెలలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 10 టిఎంసీలు, తెలంగాణకు 15 టిఎంసీల నీటిని కేటాయించారు. అయితే, ఎపి తనకు కేటాయించిన 10 టిఎంసీల నీటిని ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుంది. ఈ తరుణంలో కృష్ణా నది బోర్డు ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ, ఎపి ఇరిగేషన్ , జెన్ కో అధికారులు ఏకపక్షంగా వ్యవహారించారని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణకు ఇంకా నీటి వాటా మిగిలి ఉండటంతో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ వాటాలో భాగంగా ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, బోర్డు అనుమతి లేకుండా ఎపి నీటిని విడుదల చేయడంపై ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగింది.











