వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న హౌతీలు మరోసారి దాడులకు దిగారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన చమురు నౌకపై యెమెన్ సమీపంలో హౌతీలు బుధవారం రాత్రి క్షిపణితో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తామే ఈ దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు దాడులకు పాల్పడినా టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, సైనిక చర్య చేపడతామని హెచ్చరించారు.

గత ఏడాది వాణిజ్య నౌకలపై దాడి జరిపిన హౌతీలకు అమెరికా గట్టి బుద్ధి చెప్పిందని, మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారని ట్రంప్ పేర్కొన్నారు. హౌతీలు ఇరాన్ ప్రతినిధులే అయినందున ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని కూడా ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు. అయితే దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. పౌర వ్యవస్థలపై అమెరికా దాడి చేస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించింది.